ఆంధ్రలో కియా కార్ ఉత్పతి…

భారతదేశంలో భవిష్యత్ మొదటితరం పర్యావరణహిత కార్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్పత్తి కాబోతోంది!

“1.2 నిమిషంలో ఒక అత్యాధునిక కార్ తయారీ” లక్ష్యంగా నిర్మించబడుతున్న తన పరిశ్రమ నుండీ దక్షిణ కొరియా దిగ్గజం “కియా మోటార్స్” తొలి ప్రయోగాత్మక ఉత్పత్తిని అనంతపురం జిల్లా, పెనుకొండ మండలం, ఎర్రమంచి గ్రామం వద్ద సగర్వంగా ప్రదర్శించింది.

2016 నుంచి దేశీయంగా ఎన్నో రాష్ట్రాల పోటీని ఛేదించి, ప్రజానుకూల భూసేకరణ విధానంతో 1260 ఎకరాల భూమిని సిద్ధం చేసి, కొండలు, గుట్టలు, గుంటలతో నిండిన ఆ స్థలాన్ని 6 నెలల్లో చదును చేసి సంస్థకు స్వాధీనం చేసి, అదే 6 మసాలలో సమీపంలోని గొల్లపల్లి జలాశయాన్ని పూర్తి చేసి నీళ్ళు కూడా తెచ్చి చూపించి మరీ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న ఈ భారీ వాహన సంస్థ తన ఉత్పాదక సామర్ధ్యాన్ని పరీక్షించుకునే మొదటి దశలో తయారైన Kia Soul EV వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చారిత్రక బహుమతిగా ఇచ్చింది!

13,500 కోట్ల అతిభారీ వ్యయంతో 11,000 ఉద్యోగాల సృష్టితో భారతీయ అవసరాలకు అనుగుణమైన వాహనాలు ఇంకా 2025 నుండీ ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యంగా ప్రసిద్ధ హ్యుండాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది.

కియా సంస్థకి అనుబంధంగా హ్యుండాయ్ డైమోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మోబిస్ ఇండియా మాడ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్, హ్యుండాయ్ స్టీల్ అనంతపురం ప్రైవేట్ లిమిటెడ్, గ్లోవిస్ ఇండియా అనంతపూర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలు ఏర్పడ్డాయి.

సమీపంలోని,..అమ్మవారిపల్లి, గుడిపల్లి పారిశ్రామికవాడల్లో “కియా”కు అనుబంధంగా మరొక 20 పరిశ్రమలు 3,000 కోట్ల పెట్టుబడితో అనంతపురం కరువునేలపై ఉద్యోగాల వర్షం కురిపించటం మొదలుపెట్టాయి.

సంస్థ సరిసర ప్రాంతాలలోని పల్లెలు, పట్టణాలలో పెరుగుతోన్న భూముల ధరలు, నూతనంగా ప్రారంభమౌతున్న నిత్యావసరాల దుకాణాలు, రద్దీగా మారిపోతున్న రహదారులు  ప్రాంతీయంగా కియా సరికొత్త ఆర్ధిక అధ్యాయాన్ని సృష్టించబోతోందని హామీ ఇస్తున్నాయి.

“రాయలసీమని రతనాల సీమగా మారుస్తానన్న నా హామీని అమలుచేసి చూపిస్తున్నా, త్వరలోనే మరిన్ని పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయి. కియా రాకతో ఏపీ బ్రాండ్ మారుమోగబోతోంది.  10 -12 ఏళ్ళు పట్టే పరిశ్రమల స్థాపనని కియా కేవలం 11 నెల్లల రికార్డ్ సమయంలో పూర్తి చేసుకుని ప్రయోగాత్మక ఉత్పత్తి కూడా ఆరంభించింది. సెప్టెంబర్ సమయానికి మొదలయ్యే వాణిజ్యఉత్పత్తికి నేనూ హాజరౌతాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

ఇదే ప్లాంట్ లో 2022 సంవత్సరాంతానికి ఎలక్ట్రిక్ కార్ తయారీ మొదలవ్వవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. నైపుణ్యం కలిగిన యువత ఆంధ్రప్రదేశ్ లోనే అందుబాటులో ఉండటం వలన బయటివారిని తీసుకునే అవసరం రాలేదని ఈ కొరియన్ సంస్థ HR విభాగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న 2 ఏళ్లలో ఇటువంటివి 5 ఇంకా 2025 లోపు 16 వాహన ఉత్పత్తుల రూపకల్పన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్న కియా సంస్థ భారతదేశంలో తయారుచేసి రహదారి మీదకు తెచ్చిన మొట్టమొదటి “మేడిన్ ఏపీ కియా” వాహనం ప్రత్యేకతలు:

  • వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్స్
  • ఒకే మీటతో 4 విండోస్ నియంత్రణ
  • అన్ని సీట్స్ కు సురక్ష సాధనంగా వాడగలిగే అడ్జెస్టబుల్ “హెడ్ రెస్ట్”
  • డ్రైవర్ ముందు వివిధ కోణాల్లో తిప్పగలిగే నియంత్రణా వ్యవస్థ మరియు సమాచార తెర
  • వెనుక భాగం పైకి ఎత్తగల Clamshell bonnet

ప్రస్తుతానికి, Kia  SP2i compact SUV ఉత్పత్తిగా ఉన్న ఈ బండి నామకరణం కోసం నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో అత్యధికులు ఇష్టపడిన ట్రేజర్ (TRAZOR) పేరునే సంస్థ అధికారికంగా ప్రకటించి దీపావళి సమయానికి అమ్మకాలు మొదపెడుతుంది అని ఒక అంచనా. పెట్రోల్ మరియు డీజెల్ ఇంజిన్ తో పాటు అంతిమంగా, ఇంధన మరియు విద్యుత్ శక్తితో నడిచే హైబ్రీడ్ రకం వాహనంగా కూడా మలచవచ్చని నిపుణులు ఊహిస్తున్న ఈ Kia SP2i ధర శ్రేణిని అనుసరించి రూ9-16 లక్షలుగా ఉండబోతోంది అని సంస్థ మార్కెటింగ్ విభాగాధిపతి ప్రకటించారు. Hundai-Creta, Jeep-Compass, Renault-Captur, Maruti Suzuki-S Cross, Tata-Harrier మరియు Nissan-Kicks వాహనాలకి పోటీగా అంగట్లోకి వస్తోంది!

ఈ వాహనం తరువాత కియా sub-4m SUV, compact SUV, MPV, MUV తరహా ఆవిష్కరణలపైన గురిపెట్టింది.

ఇప్పటికే నిర్ధారించబడిన 70 కి పైగా సర్వీస్ కేంద్రాలు, అమ్మకం మరియు ప్రదర్శన అంగళ్ల డీలర్స్ తో మెట్రో నగరాలు మొదలుకుని తృతీయ స్థాయి పట్టణాలలో కూడా విస్తరించబోతున్న కియా ఇప్పటివరకు భారతదేశంలో ఏర్పడిన అతిపెద్ద కార్ల వ్యాపార వ్యవస్థలలో ఒకటిగా ఆవిర్భవించబోతోంది!

2022 సంవత్సరానికి 15% విపణి వాటా చేజిక్కించుకుని, దేశంలోని మొదటి 5 అతిపెద్ద కార్ల తయారీదార్లలో ఒకటిగా నిలవాలనే

వ్యూహంతో దూసుకుపోతున్న “మేడిన్ ఆంధ్ర కియా” కి శుభాకాంక్షలు…

కియా పరిశ్రమకు అనుబంధంగా ఏర్పాటయ్యే ఉప సంస్థలలో ఒకటైన “డుఫున్ క్లైమెట్ కంట్రోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్” కు ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఆ.ప్ర. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 9 మిలియన్ డాలర్స్ పెట్టుబడితో 200 ఉద్యోగాలు కల్పించే ఈ సంస్థకు రాష్ట్రప్రభుత్వం ఎకరం 6 లక్షల విలువతో 8.7 ఎకరాల స్థలంతో పాటూ అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటో మొబైల్ ప్రాజెక్ట్స్ పాలసీ – పారిశ్రామిక విధానం:2019-20 కింద మౌలిక సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించింది.

Leave a Comment