ఆపరేషన్ సింగపూర్ సక్సెస్..

ఏపీ ముఖ్యమంత్రి చేపట్టిన సింగపూర్ పర్యటన ముగిసింది. పర్యటన ముగించుకున్న బాబు బృందం శుక్రవారం అర్ధరాత్రి గం.1230కి హైదరాబాద్ చేరుకుంది. వీరికి టీడీపీ నేతలు దేవినేని, కొల్లు రవింద్ర, ఎల్.రమణ, ఎర్బరెల్లి తదితరులు స్వాగతం పలికారు. పర్యటన విజయవంతం అయిందని చంద్రబాబు విక్టరీ సింబల్ చూపారు. పలు పరిశ్రమలు, ఇతర రంగాలకు చెందిన దాదాపు 300మంది పారిశ్రామికవేత్తలతో ఏపీ బృందం చర్చలు జరిపిందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలు అంగీకరించారని కంభంపాటి రామ్మోహన్ రావు చెప్పారు. అంతేకాకుండా జనవరిలో సింగపూర్ ప్రతినిధులు రాష్ర్టానికి వస్తారని చెప్పారు. పర్యటన విజయవంతంగా పూర్తవటంపై సంతోషం వ్యక్తం అవుతోంది. అయితే ప్రస్తుతం ఏపికి ఉన్న సమస్యలే సవాలుగా మారాయి. ప్రస్తుతం రాజధాని సమస్య ఇంకా పూర్తి కాలేదు. అంటే విజయవాడ పరిసరాల్లో రాజధాని అని చంద్రబాబు సరిహద్దులు ప్రకటించారు. అయితే మెజార్టీ ప్రజలు భూములు ఇచ్చేందుకు అంగీకరించటం లేదు. భూములు కోల్పోతే తాము ఎలా బ్రతకాలని, ప్రభుత్వం నుంచి ఎప్పుడో వచ్చే నష్టపరిహారం కోసం ఆశించి ఎన్నాళ్ళు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు రాజధాని నిర్మాణం అంటే.., ఒక్క ఏడాదిలో పూర్తయ్యే పనికాదు. ప్రస్తుతం భూ సేకరణ దశలోనే ఉంది కాబట్టి. నిర్మాణ పనులు ఈ ఏడాదిలో ప్రారంభం అవుతాయని ఖచ్చితంగా చెప్పలేము. జనవరిలో వచ్చే సింగపూర్ ప్రతినిధులకు నిర్మాణం కాని రాజధాని చూపిస్తే…, ఇంకా క్యాపిటల్ సిటీయే పూర్తి కాలేదు. ఎలా పెట్టుబడులు పెట్టడం అనే ప్రశ్న రావచ్చు. దీనికి తోడు ప్రస్తుతం లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ, విదేశీ కంపనీలకు కేవలం భూమి విషయంలో రాయితీలు ఇవ్వగలదు. విద్యుత్, నీటి వనరులు, పన్నులు ఇతర అంశాలపై రాయితీలు ఇస్తే వాటిని మోయలేక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఇక ప్రకృతి విపత్తుల ప్రభావం కూడా ఏపీపై ఎక్కువగా ఉంటుంది. మొన్నటి హుదుద్, అంతకు ముందు వచ్చిన తుఫానులే ఇందుకు ఉదాహరణ. సింగపూర్ పారిశ్రామిక వేత్తలు కంపనీలు పెట్టాలంటే ఎగుమతులు, దిగుమతుల కోసం వారికి దగ్గర్లో విమానాశ్రయాలతో పాటు, ఓడరేవలు కూడా ఉండాలి. ఇవన్నీ దాదాపు కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో తుఫాను, వరదల ముప్పు ఎక్కువ. ఇలాంటి తరుణంలో కంపనీల మనుగడపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వారికి సందేహాలు రావచ్చు. దీనికి తోడు పర్యావరణ అనుమతులు, భూముల సేకరణ ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింగపూర్ పర్యటన విజయవంతం అయినా.., ఫలితం మాత్రం ఎలా ఉంటుంది అని ఇప్పుడే చెప్పటం కష్టం.

Leave a Comment