ఆప్ బాటలో బీజేపీ

imagesసాక్షి, న్యూఢిల్లీ: నగరవాసి నాడిని తెలుసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆమ్ ఆద్మీ పార్టీ  బాటనే ఎంచుకుంది. ఆప్ నిర్వహించే మొహల్లా సభల మాదిరిగానే ప్రజలకు ప్రశ్నావళి జారీచేసి వారి అభిప్రాయాలను తెలుసుకోనుంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలకు ముఖ్యంగా యువతకు అనేక  ప్రశ్నలు సంధించి వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాలనుకుంటోంది. ప్రజల సమస్యలేమిటి? వాటికి పరిష్కారాలేమిటి ? అనే విషయాన్ని అట్టడుగుస్థాయి ప్రజల నుంచి బూత్‌స్థాయి కార్యకర్తల ద్వారా తెలుసుకుంటామని బీజేపీ అంటోంది. ఇందుకోసం పార్టీ ఏడు అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 30 వరకు నిర్వహించతలపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు ఈ ప్రశ్నావళిని ఇంటింటికి పంచి ప్రజల ప్రాధామ్యాలతోపాటు వారి సమస్యలను తెలుసుకుంటారు.
 
 ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు గత ప్రభుత్వం అందించిన పరిష్కారాలపై కూడా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు బీజేపీ ప్రయత్నించనుంది. ఐదే ళ్లుగా కుటుంబంతోపాటు నగరంలోనే నివసిస్తున్నారా? అంటూ ఢిల్లీవాసులను ప్రశ్నించనుంది. ఏయే ప్రాంతాల్లో ఏయే సమస్యలకు ప్రాధాన్యమివ్వాలనే  విషయాన్ని కూడా ప్రజలను అడిగి తెలుసుకోనుంది. మున్సిపల్ కార్పొరేషన్ల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడంతోపాటు వారి ఆకాంక్షలను కూడా తెలుసుకోనుంది. ఇవి కాక ఢిల్లీలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సిన ఐదు సమస్యలను తెలియజేసి వాటికి పరిష్కారాలను సూచించాల్సిందిగా తన ప్రశ్నావళి ద్వారా ఢిల్లీవాసులను బీజేపీ కోరనుంది.

Leave a Comment