ఆశలు సజీవం

చెన్నైని చిత్తు చేసిన22sp3a హైదరాబాద్
 చెలరేగిన వార్నర్, ధావన్
 ధోని, హస్సీల శ్రమ వృథా
 
 రాంచీ: డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో
90; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత పోరాటం, శిఖర్ ధావన్ (49 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత బ్యాటింగ్‌తో కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగిపోయింది. భారీ లక్ష్యాన్ని నీళ్లు తాగినంత సులువుగా ఛేదించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా… బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది.

 
 ధోని (41 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ హస్సీ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మిత్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించారు. స్మిత్ రెండు కీలక భాగస్వామ్యాలతో శుభారంభాన్నిచ్చాడు. అనూహ్యంగా రనౌటైన డుప్లెసిస్ (11 బంతుల్లో 19; 4 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 33 పరుగులు; రైనా (4)తో కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. అయితే ధోని, హస్సీలు నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో అజేయంగా 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై భారీ స్కోరు చేసింది. కరణ్ శర్మ 2 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి గెలిచింది. వార్నర్, ధావన్ ధాటిగా ఆడుతూ తొలి 10 ఓవర్లలో 100 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చారు. ఇందులో ధావన్ 16 పరుగులు చేస్తే, వార్నర్ 80 పరుగులు సాధించాడు. కొద్దిసేపటికే వార్నర్ అవుట్‌కావడంతో తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నమన్ ఓజా (19), ఫించ్ (7), స్యామీ (0) వెంటవెంటనే అవుటైనా ధావన్ నిలకడగా ఆడి లాంఛనం పూర్తి చేశాడు. హస్టింగ్స్, జడేజా, రైనా తలా ఓ వికెట్ తీశారు. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
 స్కోరు వివరాలు
 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ శర్మ 47; డుప్లెసిస్ రనౌట్ 19; రైనా (సి) ఫించ్ (బి) కరణ్ శర్మ 4; డేవిడ్ హస్సీ నాటౌట్ 50; ధోని నాటౌట్ 57; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185.
 
 వికెట్ల పతనం: 1-33; 2-68; 3-77
 బౌలింగ్: భువనేశ్వర్ 4-0-36-0; స్టెయిన్ 4-0-43-0; కరణ్ శర్మ 4-0-19-2; రసూల్ 4-0-35-0; ఇర్ఫాన్ 3-0-34-0; స్యామీ 1-0-11-0.
 
 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) హస్టింగ్స్ 90; ధావన్ నాటౌట్ 64; ఓజా (సి) నేగి (బి) రైనా 19; ఫించ్ రనౌట్ 7; స్యామీ (సి) డుప్లెసిస్ (బి) జడేజా 0; వేణుగోపాల రావు నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 189.
 వికెట్ల పతనం: 1-116; 2-168; 3-176; 4-184.
 
 బౌలింగ్: మోహిత్ శర్మ 3-0-33-0; అశ్విన్ 4-0-29-0; హస్టింగ్స్ 3-0-29-1; జడేజా 3.4-0-42-1; నేగి 4-0-38-0; రైనా 2-0-17-1.
 
 నేటి మ్యాచ్ కీలకం
 ఐపీఎల్‌లో నేడు పంజాబ్, రాజస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కోసం సన్‌రైజర్స్ ఎదురు చూడాలి. ఒకవేళ రాజస్థాన్  గెలిస్తే… ఇటు సన్‌రైజర్స్, అటు ముంబై కూడా ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. ఒకవేళ పంజాబ్ గెలిస్తే… సన్‌రైజర్స్ తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై భారీ తేడాతో గెలిచి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. దీనితో పాటు లీగ్‌లో చివరి మ్యాచ్ (రాజస్థాన్ ్ఠ ముంబై) ఫలితం కోసం చూడాలి.

Leave a Comment