ఇంజినీర్ ఫిర్యాదు,నిత్య పెళ్లికొడుకు అరెస్టు

4చెన్నై : మరో నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో మోసం చేస్తున్న నిత్య పెళ్లికొడుకును.. ఓ మహిళ ఇంజినీర్ కటకటాల వెనక్కి తోయించింది. వివరాల్లోకి వెళితే ఇంజినీర్గా పని చేస్తున్న మదురవాయిల్‌కు చెందిన సరోజినికి ఇంటర్నెట్ మేట్రిమోనియల్ ద్వారా అత్తిపాక్కంకు చెందిన అంతోని క్రూస్ పరిచయం అయ్యిందిజ. తాను అనాథనని, సొంతగా అదే ప్రాంతంలో పార్సిల్ సర్వీసు నడుపుతున్నట్లు అతగాడు సరోజినికి తెలిపాడు.
 
అనంతరం ఇరువురికీ తిరువేర్కాడులోని ఆలయంలో వివాహం జరిగింది. ఆరు రోజులు మాత్రమే సరోజినితో కాపురం చేసిన అంతోని క్రూస్ సొంత ఊరు వెళుతున్నట్లు చెప్పి ఉడాయించాడు.  దాంతో అనుమానం వచ్చిన బాధితురాలు విచారణ జరపగా అంతోని క్రూస్ అసలు స్వరూపం బయటపడింది. అతగాడు అంతకు ముందు చాలామంది మహిళలను వివాహమాడినట్లు తెలియటంతో సరోజిని పోలీసుల్ని ఆశ్రయించింది.

పోలీసుల విచారణలో అంతోని క్రూస్ అంతకు ముందు మరో ముగ్గురు మహిళలను వివాహమాడి మోసగించినట్లు తెలిసింది. 1997లో తన అత్త కుమార్తె సహాయమేరిని అంతోని వివాహమాడాడు. సహాయమేరి ఆత్మహత్య చేసుకోవటంతో 2007లో సేలంలోని సూరమంగళంకు చెందిన  ఉపాధ్యాయిని ఉత్తరమేరిని వివాహమాడాడు. ఆమెతో ఏడు నెలలపాటు కాపురం చేశాడు.
ఆపై  2013లో కోవైకు చెందిన భర్త చనిపోయిన హేమావతి అనే మహిళను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. అంతే కాకుండా ఆమె వద్ద నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. అక్కడి నుంచి పరారై ఇంజినీరు సరోజినిని వివాహమాడినట్లు విచారణలో తెలిసింది. ఎట్టకేలకు సరోజిని ఫిర్యాదుతో నిత్య పెళ్లికొడుకు అంతోని క్రూస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Comment