ఇరాక్‌లో అంతర్యుద్ధం తీవ్రం

Iraq crisisబాగ్దాద్‌కు చేరువైన తిరుగుబాటు దళాలు
జీహాదీల స్వాధీనంలో మొసుల్,తిక్రిత్ నగరాలు
బాగ్దాద్, కర్బాలాలే తదుపరి లక్ష్యమన్న ఐఎస్‌ఐఎల్
సద్దాం సైన్యాధికారులతో బలోపేతమైన జీహాదీ దళం

 
 బాగ్దాద్/లండన్: ఇరాక్ సంక్షోభం ముదురుతోంది. సోమవారం ప్రారంభమైన అంతర్యుద్ధం శనివారం నాటికి మరింత తీవ్రమైంది. అల్ కాయిదా ప్రభావిత సున్నీ జీహాదీ తిరుగుబాటు దళాలు మొసుల్, తిక్రిత్ నగరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. తిరుగుబాటులో దేశ ఉత్తరప్రాంతంలో బలంగా ఉన్న కుర్దులు కూడా పాలుపంచుకుంటున్నారు.  ఉత్తర, ఉత్తరమధ్య ఇరాక్‌లోని అనేక ప్రాంతాలపై పట్టు సాధిస్తూ బాగ్దాద్‌ను కైవసం చేసుకునే దిశగా జీహాదీ దళాలు ముందుకు కదులుతున్నాయి. బాగ్దాద్‌కు అవి కేవలం 100 కి.మీల దూరంలో ఉన్నాయని సమాచారం. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతుదారులైన ఈ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్‌ఐఎల్)’ దళాలనుఇరాక్ సైన్యం ఎదుర్కోలేకపోతోంది. షియా గిరిజన యోధులు మాత్రం వారిని కొంతవరకు నిలువరిస్తున్నారు. ఐఎస్‌ఐఎల్ దళాలను ప్రజలు సాయుధులై కలసికట్టుగా ఎదుర్కోవాలని షియాల అత్యున్నత మత పెద్ద అయోతుల్లా అలీ అల్ సిస్తానీ శుక్రవారం పిలుపునిచ్చారు.

సున్నీ జీహాదీలను ఎదుర్కొనేందుకు వేలాది షియాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. అలాగే, షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న, సుశిక్షితులైన ప్రభుత్వ దళాలున్న బాగ్దాద్‌ను  కేవలం వేలల్లో ఉన్న జీహాదీ తిరుగుబాటుదారులు కైవసం చేసుకోలేరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బాగ్దాద్‌కు ఉత్తరంవైపు ప్రభుత్వ సైనికదళాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. చెక్‌పోస్ట్‌లు నిర్మించి, సాయుధులను కాపలాగా పెట్టాయి. కాగా, బాగ్దాద్‌తో పాటు షియాలకు పవిత్ర నగరమైన కర్బాలాలే తమ తదుపరి లక్ష్యమని ఐఎస్‌ఐఎల్ ప్రతినిధి అబూ మొహమ్మద్ అల్ అద్నానీ ప్రకటించారు. సున్నీలు, కుర్దులు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితి నెలకొంది.

దళాలు పంపించబోం: అమెరికా, బ్రిటన్

 తిరుగుబాటుదారులను అణచివేసేందుకు తమ దేశం నుంచి సైనిక దళాలను పంపించడం లేదని అమెరికా, బ్రిటన్‌లు స్పష్టం చేశాయి. ఇరాక్ తమకు అత్యంత ముఖ్యమైన దేశం అయినప్పటికీ.. ఆ దేశ సంక్షోభాన్ని ఆ దేశస్తులే పరిష్కరించుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. సైనిక దళాలను పంపించడం కాకుండా.. ఇరాక్ ప్రభుత్వానికి సహకరించే ఇతర మార్గాల గురించి ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఇరాక్‌లో అస్థిరతను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ తెలిపింది. అయితే, ఇరాక్ ప్రభుత్వానికి మద్దతుగా తమ దళాలను ఇరాక్ పంపించడం లేదని స్పష్టం చేసింది. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న, జీహాదీలతో పోరాడుతున్న ఇరాక్ ప్రజలకు రూ. 29.84కోట్ల విలువైన సామగ్రిని బ్రిటన్ పంపిస్తోంది.
 

Leave a Comment