ఈజిప్టు అధ్యక్షునిగా అబ్దెల్ ఫత్తా

abdulకై రో: ఈజిప్టు మాజీ సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్- సిసీ దేశాధ్యక్షునిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షపదవికి గతవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 96.6 శాతం ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 59 ఏళ్ల అబ్దెల్ ఫత్తా  ఈజిప్టుకు ఏడవ అధ్యక్షుడు. సుప్రీంకోర్టు జనరల్ అసెంబ్లీ ఎదురుగా ఆయన పదవీస్వీకార ప్రమాణం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో తొలిసారి ఎన్నికైన మహమ్మద్ మోర్సీని ఆయన గత ఏడాది పదవీచ్యుతుడిని చేశారు. సైన్యంపై పట్టుకలిగిన రిటైర్డు ఫీల్డ్‌మార్షల్ అయిన ఫత్తా దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలను సరిదిద్దుతానని ఈ సందర్భంగా ప్రతిన బూనారు. నాలుగేళ్ల పాటు ఆయన అధ్యక్షునిగా కొనసాగుతారు.

దేశం ఇంటాబయటా తలెత్తుకుని తిరిగేలా ముఖ్యమైన మార్పులుంటాయని ఆయన చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్‌ను, సుస్థిరమైన ప్రగతిని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోర్సీ ఉద్వాసనకు గురయ్యాక అప్పటివరకు సైన్యాధిపతిగా ఉన్న ఫత్తా తన పదవికి రాజీనామా చేశారు. గతనెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హందీన్ సబాహీతో పోటీపడ్డారు. అబ్దెల్ ఫత్తా ప్రమాణం సందర్భంగా కైరోలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.

Leave a Comment