ఈడెన్‌లో లాఠీచార్జి

5కోల్‌కతా: ఐపీఎల్-7 విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఆటగాళ్ళను అభినందించేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున అభిమానులు చొచ్చుకురావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
 
 వాస్తవానికి ఉదయం 9 గంటలనుంచే ఈడెన్‌కు అభిమానులు పోటెత్తారు. అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రాంతానికి వేలాది మంది రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్టేడియం గేట్లు మూసివేసి ఉండడంతో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. చివరికి లాఠీలకు పనిచెప్పారు. ఈఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలున్నారు. ఈ విషయంపై బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీంని మీడియా ప్రశ్నిస్తే.. స్టేడియం దగ్గర గొడవ మీకు కనిపిస్తుందేమో కానీ నాకైతే ఏమీ కనిపించడం లేదంటూ సమాధానమిచ్చారు.
 
  అయితే స్టేడియంలో ప్రవేశం ఉచితమనే భావనతో పెద్ద ఎత్తున అభిమానులు ఈడెన్‌కు చేరుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్లలో, క్యాబ్ గుర్తింపు పొందిన క్లబ్బులలో కాంప్లిమెంటరీ పాస్‌లు మంజూరు చేశారు. ఉదయం 11 గంటల నుంచి స్టేడియంలోనికి అనుమతించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం ఆలస్యంగా మొదలైంది. నాలుగు గంటల ప్రాంతంలో సీఎం వచ్చిన తర్వాత ఆమె ఆదేశాల మేరకు బయట ఉన్న అభిమానులు కూడా స్టేడియంలో లోపలికి పంపారు.

Leave a Comment