ఈ గడ్డ కరెంటు ఈ గడ్డకే

3కొత్తపేట: సీమాంధ్రలో ఉత్పత్తి అయిన విద్యుత్ అంతా ఈ ప్రాంతానికే దక్కాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఈపీడీసీఎల్ యూనిట్ చైర్మన్ వీఎస్‌ఆర్‌కే గణపతి అన్నారు. ఆదివారం రాత్రి కొత్తపేటలో ట్రాన్స్‌కో రిటైర్డ్ ఎల్‌ఐ, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిద్దే సత్యనారాయణమూర్తి ఇంట ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లో విద్యుత్ రంగానికి సంబంధించి కీలక అంశం చోటుచేసుకుందన్నారు.

విద్యుదుత్పత్తి కేంద్రాలను భౌగోళికంగా విభజించినా వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రెండు రాష్ట్రాల పంపిణీ సంస్థలకు ఇప్పటి మాదిరిగానే వర్తిస్తాయని ప్రభుత్వం గత నెల 8న జీఓ-20 జారీ చేయడం శోచనీయమన్నారు. ఈ విధానాన్ని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 60.5 శాతం కాగా.. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 46.11 శాతం మాత్రమే కేటాయించడం, తెలంగాణ లో ఉత్పాదక సామర్థ్యం 39.5 శాతం కాగా ఆ రాష్ట్రానికి 53.89 శాతం కేటాయించడం దుర్మార్గమన్నారు.

సీమాంధ్ర ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తక్షణమే స్పందించి ఈ జీవోను రద్దు చేయించి, సీమాంధ్రలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఈ ప్రాంతానికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. సీమాంధ్రులకు జరగబోతున్న అన్యాయాన్ని వినియోగదారుల సంఘాలు, పారిశ్రామిక, రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ అవసరాలు తీరాకే మిగిలిన విద్యుత్‌ను మాత్రమే తెలంగాణ కు ఇవ్వాలన్నారు.

Leave a Comment