ఈ బంపర్ ఆఫర్ కేవలం భారతీయులకే…!

విమానయాన సంస్థల మద్య పోటి గురించి చెప్పనక్కర్లేదు. వేల రూపాయలు ఉండే టికెట్ల ధరలను పోటి కారణంగా ఒకేసారి వందల రూపాయలకు కూడా అందించిన ఘనత మన విమానయాన సంస్థలది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సంస్థలు పరస్పరం పోటి పడుతూ ప్రయాణికులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఖతార్ ఎయిర్ వేస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దోహ నుంచి కార్యకలాపాలు సాగించే ఈ విదేశీ విమానయాన సంస్థ ప్రత్యేకించి భారతీయుల కోసం ఆఫర్ ప్రకటించటం విశేషం. ‘డబుల్ ద లగ్జరీ’ పేరుతో ప్రకటించిన ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రకారం.., భారతీయులు ఖతార్ ఎయిర్ వేస్ బిజినెస్ క్లాస్ ప్రయాణం కోసం ఒక టికెట్ కొంటే వారికి మరొక టికెట్ ఉచితంగా లభిస్తుంది. మంగళవారం మొదలయిన ఈ ఆఫర్ ఐదు రోజుల పాటు అంటే శనివారం వరకు ఉంటుందని ఎయిర్ వేస్ భారత శాఖ వైస్ ప్రెసిడెంట్ ఇహాబ్ సొరియాల్ ప్రకటించారు. ఈ బంపర్ ఆఫర్ తో తమ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందని సొరియాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కండిషన్స్ అప్లై అన్నట్లుగా ఈ ఆఫర్ ఎంపిక చేసిన దేశాలకు వెళ్ళేందుకే వర్తిస్తుంది. భారత్ లోని 12 విమానాశ్రయాల నుంచి న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, షికాగో, డల్లాస్, హూస్టన్, మయామి, లండన్, పారిస్, రోమ్ సహా పలు నగరాలకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం అన్నారు. అయితే ఒక్కరే ప్రయాణించాల్సి వస్తే.., ఉచిత టికెట్ వద్దు యాబైశాతం డబ్బులు ఇవ్వండి అంటే కుదరదు.., టికెట్ కావాలంటే తీసుకొండి.. లేదంటే మీ ఇష్టం. ఏదయితేనేం ఖతార్ డబుల్ బొనాంజా ప్రకటించింది. మరి ఈ ఆఫర్ సంస్థకు ఏ మేర కాసులు కురిపిస్తుందో తెలియాల్సి ఉంది.

Leave a Comment