ఉగ్రవాదగడ్డపై ఉరిమిన వాయుసేన

భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకువెళ్లి పుల్వమా దాడికి పాల్పడ్డ జైష్ ఎ మహమ్మద్ సంస్థ ఉగ్రవాద శిబిరాలను 1000 కిలోగ్రాముల పేలుడు పదార్దాలతో పలకరించింది! శిక్షణ పొందుతున్న 300 మంది పైగా ఔత్సాహిక మరియు అనుభవజ్ఞ తీవ్రవాదులు పేలుళ్ళ ధాటికి కనీసం శరీరపు ఆనవాళ్ళు కూడా మిగలకుండా తునాతునకలై పోయారని సైనిక వర్గాలు వెల్లడించాయి.

దీర్ఘకాలంగా జైష్ ఎ మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద ముఠాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా గుర్తించటం మన రక్షణ దళాల వ్యూహ నైపుణ్యానికి గీటురాయి! పుల్వామా ఘటన బాధ్యుల అంతు చూడాలని దేశప్రజలు ఉన్మాద మూకలని శిక్షించటంలో నినదిస్తుండటంతో రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైన ప్రబుత్వానికి అండగా నిలబడతామని ప్రకటించాయి. కాశ్మీర్ లో మూలమూలలా నక్కిన దేశద్రోహులను క్రమం తప్పకుండా సైనికులు ఏరివేస్తున్నప్పటికీ, గూడుకట్టుకున్న ప్రతీకార వాంఛ వల్ల దూకుడుతో ముందుకు వెళ్లిపోతున్న జవాన్ల ప్రాణాలు ఇప్పటికీ కోల్పోతూ ఉండటం ఘటన జరిగిన రోజు నుండీ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అయితే, “సర్జికల్ స్ట్రైక్ 2” పిలవబడుతున్న నేటి ఎదురుదాడి మొదటిసారి భారతీయ సైన్యం సత్తా ఏమిటో నిరూపించింది.

 

మంగళవారం తెల్లవారకముందే 3.45am గంటలకు మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్ బృందం, డ్రోన్ వీక్షణ ఇంకా క్షేత్ర పరిశీలకులు మరియు విశ్లేషకుల సమన్వయంతో బాలకోట్ వద్ద శిబిరాలపై బాంబులు కురిపించి వెనుదిరగగా, క్షేత్ర నిర్దేశకులు అనుమతించిన రెండవ మిరాజ్ 2000 బృందం 3.58am ముజఫరాబాద్

వద్ద లేజర్ గైడెడ్ మిసైల్స్ ని లక్ష్యాల మీదకి వదిలి క్షేమంగా వెనుదిరిగింది. చివరిగా 3.58am గంటలకు చికోటి ప్రాంతం మీద కూడా స్వేచ్చగా తిరుగాడిన మిరాజ్ పైలట్స్ అక్కడి శిబిరాలను శిధిలం చేసి విజయధరహాసంతో నేల మీద అడుగుపెట్టారు! పాకిస్తాన్ సైన్యం అప్రమత్తతని పరిహాసిస్తూ అత్యంత ధైర్యం, సాహసం, నైపుణ్యాలతో భారీ అణ్వస్త్ర ప్రయోగ సామర్ధ్యం ఉన్న 12 మిరేజ్ మల్టీ రోల్ ఫైటర్స్ నడుపుతూ గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో వీరవిహారం చేసి పాకిస్థాన్ ఆర్మీ తేరుకునేలోపే కేవలం 21 నిమిషాల్లో క్లిష్టమైన ఈ 3 అంచెల దాడుల ప్రక్రియని పూర్తి చేశారు! భారత యుద్ధ విమానాలు pok గగనతలం మీదుగా ఎగురుతున్న సమయంలో పాకిస్తాన్ రాడార్స్ ని స్తంభింపచేసినట్లు సమాచారం! ఈ దాడులలో ప్రధానంగా జైష్ ఎ మహమ్మద్ కి చెందిన ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్ నామరూపాలు లేకుండా పోయిందని తెలుస్తోంది.

 

సైనికుల నిర్జీవ శరీరాలని చూసిన సంతాపం, వారి కుటుంబీకుల విషాదం దాదాపు దేశంలోని ప్రతి చౌరస్తా లోనూ, వీధుల చివర ఫ్లెక్సి, బానర్స్ రూపంలో 10 రోజులుగా పంచుకుంటున్న ప్రజలకి సర్జికల్ స్ట్రైక్స్-2 ఆనందాన్నిచ్చాయి. రాజకీయ నాయకులు క్రీడాకారులు సినీతారల నుండీ సామాన్య పౌరుల వరకూ తాము సైన్యం చేసిన అసమాన పోరాటాన్ని చూసి గర్విస్తున్నామని ముక్తకంఠంతో శ్లాఘించారు. సామాజిక మాధ్యమాలలో సైనిక సాహసాలకి వందనాలు ఆర్పిస్తూ మొదలై, అసంఖ్యాక పోస్ట్ లలో దర్శనమిస్తున్న #IndiaStrikesBack #IndianAirForce #IndiaStrikesPakistan హ్యాష్ ట్యాగ్స్,.పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం కారణగా పుల్వామా/కాశ్మీర్ సైనిక మరణాలపై ప్రజలలో అంతకంతకూ రగులుతున్న ఆగ్రహానికి దర్పణం పట్టాయి.

ఈ రోజు సరిహద్దు దాటుకుని వచ్చి భారత భూభాగంలో గుజరాత్ ప్రాంతంలో తిరుగుతున్న డ్రోన్ కెమెరా ని భారతీయ సైనికులు పసిగట్టి పేల్చేశారు.

“మన దళాలు సన్నద్ధంగానే ఉన్నా కూడా చీకటిగా ఉండటం వల్ల ఏమీ చెయ్యలేకపోయాయి” అని పాకిస్తాన్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆ దేశ పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు.

షరామాములు అన్నట్లు, భారత్ లో దాడుల విషయం పూర్తిగా తెలియక ముందే…ఇంకా తెల్లవారక ముందే 5.30am నుంచే ఈ దాడులు అసలు జరగనే లేదు ఇదంతా భారతదేశ రాజకీయ కల్పిత కధనం అంటూ  పాకిస్తాన్ మీడియా సంస్థలు మూకుమ్మడిగా వరుస కధలు ప్రచారం చెయ్యటం ప్రారంభించాయి!

అయితే, ఈ దాడులని BBC సహా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రత్యక్ష సాక్షుల కధనాలతో ధృవీకరించగా, ఈ రోజు జరిగిన పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్షాలు సిగ్గు సిగ్గు అంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తూలనాడాయి. ఈ ఘటనకి ప్రతిచర్య ఉంటుందని ఆ దేశ రక్షణ మంత్రి సభ్యులకు సమాధానమిచ్చారు.

భారత్‌ అంతర్జాతీయ సహకారం ద్వారా ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని కోరిన చైనా, జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌ను తోసిపుచ్చుతూనే తాజాగా మెరుపు దాడులపైనా తనదైన శైలిలో స్పందించింది. దక్షిణాసియాలో భారత్‌, పాకిస్తాన్‌ రెండూ కీలకమైన దేశాలనీ, ఇరుదేశాల మధ్య మెరుగైన సంబంధాలు దక్షిణాసియా ప్రాంతంలో పరస్పర సహకరానికి, ఈ ప్రాంతంలో శాంతి, సుస్ధిరతకు దారితీస్తాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కంగ్‌ పేర్కొన్నారు.

కొసమెరుపు :

మరొక వైపు మన “సర్జికల్ స్ట్రైక్-2” పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సూచి ని 900 పాయింట్స్ క్రిందకు  కూలదొసింది…

Leave a Comment