ఎన్నికల వేళ…ఏందిదీ?

NCP alliance Ajit Pawarముంబై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జలవనరులశాఖలో జరిగిన కుంభకోణంపై డాక్టర్ మాధవరావ్ చితలే కమిటీ ఇచ్చిన నివేదికలోని వివరాలు అసెంబ్లీ వేదికగా బట్టబయలయ్యాయి. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అందుకు మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులేనని నివేదికలో పేర్కొనడంతో అప్పటి జలవనరులశాఖ మంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ ఇరుక్కున ్నట్లయింది.
 
గతంలో ఈ కుంభకోణం విషయమై అజిత్‌పవార్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి, శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే కుంభకోణంలో అక్రమాలు జరిగాయని చితలే కమిటీ పేర్కొనడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు పాశుపతాస్త్రం దొరికినట్లయింది.బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంపై సభలో మాట్లాడుతూ… కుంభకోణానికి రాష్ట్రప్రభుత్వంతోపాటు మంత్రులు, అధికారులను బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అజిత్ పవార్, విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ బోర్డు డెరైక్టర్ దేవేంద్ర శిర్కేలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
 
రాష్ట్రంలోని 53 ప్రాజెక్టులకు సంబంధించి చితలే కమిటీ దర్యాప్తు చేసి నివేదిక రూపొందించిందని, వీటిలో అనేక ప్రాజెక్టుల నిర్మాణాల్లో చోటుచేసుకున్న లోపాలను చితలే కమిటీ బయటపెట్టిందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాకుండానే ప్రభుత్వం పనులకు ఆమోదం తెలిపిందని ఫడ్నవీస్ సభకు తెలిపారు. సాంకేతికంగా కూడా ఎలాంటి పరీక్షలు చేయకుండానే పనులు ప్రారంభించారని,  అనేక మార్పులు కూడా చేశారని, దీంతో గణనీయంగా ప్రాజెక్టుల వ్యయం పెరిగిందని, వ్యయం అధికమవుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసిందని, ఇలా ప్రభుత్వంతోపాటు అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారని కమిటీ నివేదికలో వెల్లడించిన విషయాలను ఫడ్నవీస్ సభ ముందుంచారు.
 
ఇదీ కుంభకోణం చరిత్ర…
2012 సెప్టెంబర్‌లో జలవనరుల కుంభకోణం బయటపడింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న చిన్నా, పెద్దా ప్రాజెక్టులకు సంబంధించి రూ. 35 వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని స్వయంగా జలవనరులశాఖ చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర సాంకేతిక సలహాదారు సమితి సభ్యుడు విజయ్ పాండరే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్దదుమారమే రేపాయి. దీంతో అప్పటి జలవనరులశాఖ మంత్రిగా ఉన్న అజిత్‌పవార్ ఎట్టకేలకు రాజీనామా చేశారు.
 
 ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలని దర్యాప్తు బాధ్యతలను చితలే కమిటీకి అప్పగిం చింది. ఇక 72 రోజుల పాటు మంత్రి పదవికి దూరంగా ఉన్న ఆయన శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆరోపణలపై దర్యాప్తు జరిపిన చితలే కమిటీ అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనంటూ అనేక విషయాలను నివేదికలో వెల్లడించింది. వీటన్నిం టికి మంత్రి అజిత్‌పవారే బాధ్యుడు కావడంతో ఆయన ఎన్నికలకు ముందు ఇరకాటంలో పడ్డట్టయింది.
 
 అసెంబ్లీ ముందుకు 15 పేజీల రిపోర్టు మాత్రమే..
జలవనరులశాఖలో చోటుచేసుకున్న అక్రమాలపై చితలే కమిటీ 650 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందులోని 15 పేజీల యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ఏటీఆర్)ను మాత్రమే సభలో ప్రవేశపెట్టింది. మంత్రిగా అజిత్‌పవార్ తీసుకున్న చర్యల కారణంగా 42 శాతం సాగుక్షేత్రం, 26 శాతం సాగునీటి క్షేత్రం వృద్ధి అయినట్లు నివేదిక స్పష్టం చేసిందని చెబుతూ అజిత్‌పవార్‌కు క్లీన్‌చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. నివేదిక మొత్తాన్ని సభ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశాయి.

Leave a Comment