ఎప్పుడూ లాభాలేనా…..

విశాఖను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు విశాఖ కలెక్టరేట్ లో సెల్ ఫోన్ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఇంకా పునరుద్ధరించకపోవడంపై బాబు తీవ్రంగా ఆగ్రహించారు. లాభాలు తప్ప ప్రజల ఇబ్బందులు పట్టవా అని మండిపడ్డారు. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు సీఎం పై సీరియస్ అయ్యారు. విలువైన సమయాన్ని సమీక్షలతో సరిపెడుతున్నారని ఆయన అన్నారు.

టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఇంకా సెట్ కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. భారతీ ఎయిర్ టెల్ సీఈవో సునీల్ మిట్టల్ ముఖ్యమంత్రి చంద్రబాబును విశాఖలో కలుసుకున్నారు. సమావేశంలో టెలికాం సేవలు అందుబాటులోకి రాకపోవడం బాబు సీరియస్ అయ్యారు. లాభాలు తప్ప ప్రజల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. టెలికం వారు సరిగా స్పందించి ఉంటే రెండు రోజుల్లోనే కమ్యూనికేషన్ పునరుద్ధరణ జరిగేదని బాబు చెప్పారు.

అయితే దీనికి సమాధానంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే పనుల్లో వెనుకపడ్డామన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. ఎయిర్ టెల్ నెట్వర్క్ పునరుద్ధరణలో సిబ్బంది 48 గంటల పాటు శ్రమించారన్నారు. ఎల్లుండిలోగా అన్ని ప్రాంతాల్లో తమ నెట్వర్క్ సేవలు వస్తాయని,సాయంత్రానికి మరో ఐదు ప్రాంతాల్లో ఎయిర్ టెల్ సేవలు పునరుద్ధరిస్తామని మిట్టల్ తెలిపారు. ముఖ్యమంత్రి అంచనాలను అందుకోలేకపోయామన్న మిట్టల్, ప్రభుత్వం సహాయ చర్యలు అభినందనీయమన్నారు.

మరో వైపు ప్రతిపక్ష పార్టీ నేత అంబటి రాంబాబు..చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటాన్ని వదిలి ప్రజలకు సాయం చేయాలని అన్నారు. ప్రధాని మోడీ ఫోన్ చేసేవరకూ చంద్రబాబు విశాఖ ఎందుకు వెళ్లలేదని అంబటి ప్రశ్నించారు. విలువైన సమయాన్ని సమీక్షలతో వృథా చేస్తున్నారని ఆయన ..ముఖ్యమంత్రిని విమర్శించారు.

తుపాను విరుచుకుపడుతోందన్న వార్తలు వచ్చినప్పట్నుంచి ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలతో ముందుకెళుతోందని బాబు తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం  చేసి భరోసా కల్పిస్తున్నామని..త్వరలోనే పునరుద్ధరణ పూర్తవుతుందన్నారు.

Leave a Comment