ఎయిర్ ఆసియా: పింగ్స్ లభ్యం, బ్లాక్ బాక్స్ ఆచూకీ లేదు

జకార్తా, ఇండోనేషియా: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం శకలాలను వెతుకుతున్న బృందాలకు తాజాగా పింగ్స్ దొరికాయి. ఇంతకు ముందు తోక భాగం లభించిన విషయం తెలిసిందే. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందానికి పింగ్స్ లభించడంతో మిగతా శకలాలు కూడా లభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. నిజానికి, ఎయిర్ బస్ ఎ320 – 200 బ్లాక్ బాక్స్ కాక్ పిట్ వాయిస్, ఫ్లయిట్ డేడా విమానం తోకభాగంలోనే ఉంటాయి. అయితే, అవి విడిపోయి ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తోక భాగంలో బ్లాక్ బాక్స్ లేదని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ దర్యాప్తు అధికారి సంతోస్ సయోగో చెప్పారు. పింగ్స్ దొరికినట్లు మాత్రం తమకు సమాచారం అందినట్లు చెప్పారు. అది బ్లాక్ బాక్స్ కావచ్చునని భావించామని, గజ ఈతగాళ్లు ధ్రువీకరించాల్సి ఉందని, తోక భాగం నుంచి బ్లాక్ బాక్స్ విడిపోయినట్లుందని, దురదృష్టకరమని అన్నారు.
Air-asia-5687
కాగా, ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజిలా యాంగీ రణస్టియానీస్ టీవీ చానల్స్ ముందుకు వచ్చి స్పందించారు. విమానం కూలిన విషయంలో తన తండ్రిని తప్పుపట్టవద్దని ఆమె కోరారు. చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులోని ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పారు. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణీకులకు హానీ కలిగించాలని అనుకోరని చెప్పారు. అలా ఓ పైలట్ వ్యవహరిస్తారంటే తాను అంగీకరించలేనని చెప్పారు. తన తండ్రి కూడా ఈ ప్రమాదంలో మరణించారని, ఆయన మృతదేహం కూడా ఇప్పటి వరకు లభించలేదన్నారు. ఇప్పటికే తమ కుటుంబం ఆవేదనలో ఉందన్నారు.

Leave a Comment