ఒకే సంస్థకు రాజధాని నిర్మాణ బాధ్యత

రాజధాని నిర్మాణ బాధ్యత ఒకే సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం కోసం రెండు లేక మూడు సంస్థలను ముందుగా గుర్తించాలని, అయితే బాధ్యతను మాత్రం ఒకరికే అప్పగించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన సంస్థలనుంచి డిజైన్లు సేకరించనున్నారు. వాటిలో నచ్చిన డిజైన్‌ను ఒక సంస్థకు అప్పగించాలని యోచిస్తున్నారు. నిర్మాణ బాధ్యత అప్పగించిన సంస్థకు టెండర్ ఖరారుచేస్తూ… తిరస్కరణకు గురైన సంస్థలకు నష్టపరిహారంగా కొంత మొత్తం చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని కూడా యోచిస్తున్నారు. సంస్థలను గుర్తించడానికి ముందుగా ముఖ్యమంత్రి అధ్వర్యంలో ప్రత్యేక బృందం సింగపూర్, జపాన్, చైనా దేశాల్లో పర్యటించాలని నిర్ణయించింది. అక్కడి నగరాల నిర్మాణాన్ని స్వయంగా అధ్యయనం చేయడమే కాకుండా, పెట్టుబడుల సేకరణకు కూడా ఈ యాత్రలను మలచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 11వ తేదీ నుంచి చంద్రబాబు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ముందుగా 11వ తేదీ రాత్రి సింగపూర్‌కు వెళ్లనున్న చంద్రబాబు బృందం మూడు రోజులపాటు సింగపూర్‌లో అధ్యయనం చేస్తుంది. ముఖ్యమంత్రితోపాటు దాదాపు పాతిక మంది వరకు అధికార, అనధికార ప్రతినిధులు వెళ్లనున్నారు. వీరంతా భిన్న కోణాల్లో అధ్యయనం చేయనున్నారు. బృందంలో ఉండే పారిశ్రామిక వేత్తలు పారిశ్రామిక రంగం అభివృద్ధిపై దృష్టి పెట్టగా, అధికారులు పెట్టుబడుల రాకపై దృష్టి సారిస్తారు. ఇక చంద్రబాబు నేరుగా రాజధాని నిర్మాణాలను పరిశీలించడమే కాకుండా, పారిశ్రామిక వేత్తలతో కూడా ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు.12వ తేదీన పారిశ్రామిక సదస్సులో పాల్గొనే చంద్రబాబు, తరువాత పెట్రో కారిడార్, పారిశ్రామిక వాడలు, పోర్టులను సందర్శిస్తారు. 14వ తేదీన దక్షిణాసియా దేశాల సదస్సులో ప్రసంగిస్తారు.  ఇదే సమయంలో అక్కడి నిర్మాణాలు, ఎనర్జీ ఎపిషియన్సీ భవనాలు, అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అధ్యయనం చేస్తారు. ఇక ఈ పర్యటనలో సిఐఐ సభ్యునిగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పెట్టుబడుల ఆకర్షణలో కీలక భూమిక నిర్వహించనున్నారు. సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలతో ఆయన నేరుగా భేటీ కావాలని యోచిస్తున్నారు. ఇలా ఉండగా, రాజధాని నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో భేటీ అయింది. మంత్రులు అందుబాటులో లేకపోయినప్పటికీ… ఎంపి గల్లా జయదేవ్, అధికారులు, ఇతర సభ్యులు భేటీ అయి రాజధాని నిర్మాణంపై చర్చించారు.

Leave a Comment