ఓపెన్ లెటర్‌లో మీడియాపై శ్వేతాబసు అసహనం!

వ్యభిచార ఆరోపణల పైన క్లీన్ చిట్ వచ్చిన టాలీవుడ్ నటి శ్వేతాబసు మీడియా పైన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వ్యభిచార ఆరోపణలతో తనను పోలీసులు అరెస్టు చేసినప్పుడు తనతో పాటు గదిలో ఓ వ్యాపారవేత్త ఉన్నాడని నిరూపించగలరా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కోర్టు శ్వేతాబసుపై ఉన్న అభియోగాలను కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ రోజు తాను సంతోషం అవార్డుల పండగ కోసం హైదరాబాద్‌కు వచ్చానని శ్వేతాబసు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వ్యభిచారం చేయాల్సి వచ్చిందని తన పేరిట ఎవరో తప్పుడు ప్రకటన మీడియాకు అందించారని ఆరోపించారు. అసలు సమస్య అంతా సంఘంలోనే ఉన్నదన్నారు. తనపై జాలి చూపిన వారే, ఆ తప్పుడు ప్రకటన తర్వాత తాను నిజాలు దాస్తున్నట్టు భావించారన్నారు. హైదరాబాద్ పోలీసులు చెబుతున్నట్టు తన జీవితంలోకి ప్రవేశించిన ఆ బిజినెస్ మాన్ ఎవరు? అతను ఎవరో నాకూ తెలుసుకోవాలని ఉందన్నారు.

swetha-basu-prasad-20-7

నేనూ ఈ విషయంలో ఆత్రుతతో ఉన్నానని, తనతో పాటు పోలీసులకు పట్టుబడ్డ ఆ వ్యాపారవేత్త పేరు కూడా ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. తాను రెస్క్యూ హోంలో 59 రోజులు ఉన్నానని చెప్పారు. ఈ రెండు నెలలు తనకు టెలివిజన్, న్యూస్ పేపర్, ఇంటర్నెట్ అందుబాటులో లేదని చెప్పారు. దీంతో బయట ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. రెస్క్యూహోంలో ఉన్నన్ని రోజులు తాను పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, హిందుస్తాన్ని క్లాసికల్ నేర్పించానని చెప్పారు. తాను పన్నెండు పుస్తకాలు చదివానని చెప్పారు. కాగా, వ్యభిచారం చేస్తూ పట్టుబడిందనే ఆరోపణలకు సంబంధించిన కేసులో హీరోయిన్ శ్వేతాబసుకు హైదరాబాద్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సెషన్స్ కోర్టు శుక్రవారం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడిన శ్వేతాబసు ఊరట పొందినట్లు కనిపించారు. హైదరాబాద్ సెషన్స్ కోర్టు తనకు క్లిన్ చిట్ ఇచ్చిన మాట నిజమేనని, అది ఎంతటి ఊరట అనే విషయాన్ని మాటల్లో చెప్పలేనని, ఇది తనకూ తన కుటుంబానికీ పెద్ద ఊరట అని, కొన్ని నెలల తర్వాత తాము నవ్వుగలుగుతున్నామని ఆమె అన్నారు. అటువంటి ఊరట కోసమే తాను నిరీక్షిస్తూ వస్తున్నట్లు తెలిపారు. తన చుట్టూ అల్లిన కథ ఎంత వ్యర్థమైందో బయటపడిందని అన్నారు. తాను ఆనందంగా ఉన్నానని చెప్పారు. జీవితం అందంగా, ఆశావహంగా కనిపిస్తోందని అన్నారు. ఓ వర్గం మీడియా తనపై బురద చల్లడం బాధగా ఉందని అన్నారు. తన తరఫున వాదనను వినడానికి సమయం ఇవ్వాల్సి ఉండిందని శ్వేతాబసు అన్నారు. తనకు క్లీన్ చిట్ వచ్చిందని, అది చాలునని, తనకు ఎవరి మీద కూడా కోపం లేదని ఆమె అన్నారు.

 

Leave a Comment