మాస్టర్ బ్యాట్స్ మన్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకన్న విషయం తెలిసిందే. సచిన్ నిర్ణయంతో సమీప సంవత్సరాల్లో గ్రామ రూపు రేఖలు మారిపోనున్నాయి. చిన్న కుగ్రామం అన్ని వసతులతో విలసిల్లనుంది. రెండు నెలల క్రితం వరకు కనీసం జిల్లాలోని ప్రజలందరికి కూడా తెలియని ఈ గ్రామం పేరు ఇఫ్పుడు దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఇంతలా ప్రాముఖ్యత సంపాదించుకున్న కండ్రిగ గ్రామంను సచిన్ ఎందుకు ఎంపిక చేసుకున్నాడు..? దేశంలో చాలా గ్రామాలు, సొంత రాష్ర్టం మహారాష్ర్టలో కూడా గ్రామాలు ఉండగా ఏపీలోని ఈ గ్రామంనే ఎందుకు దత్తత తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు..? అని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. రెండు నెలల క్రితం సచిన్ విదేశాల నుంచి తిరిగి వస్తుండగా.., ఆయన ప్రయాణిస్తున్న విమానంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి కూడా ప్రయాణించారు. సచిన్ ను చూసి తనను తాను పరిచయం చేసుకున్న జేసీ, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించిందట. ఈ సందర్బంగా సచిన్ ఏదైనా సాయం చేయాలని వీలయితే ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆమె కోరినట్లు తెలిసింది. అప్పటికే ప్రధాని మోడి ఎంపీలు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడైన సచిన్ కు పీఆర్ కండ్రిగ గ్రామం గురించి జేసీ రేఖ చెప్పటంతో ఆమె విజ్ఞప్తి ప్రకారం, పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని ప్రధానికి తెలియజేశారు. ఇదే పీఆర్ కండ్రిగను దత్తత తీసుకోవటం వెనక ఉన్న సీక్రెట్. జేసీగా తను బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లాను బాగుచేసుకునేందుకు అన్ని వనరులను వినియోగించకునేందుకు మొహమాటపడని రేఖను మెచ్చుకోవటంతో పాటు, సొంత రాష్ర్టంలో గ్రామాలుండగా కూడా ఏపీకి సాయం చేసేందుకు వస్తున్న సచిన్ ను అభినందించాలి.
Recent Comments