కంపు భరించలేక.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

6ఇంతవరకూ రకరకాల కారణాల వల్ల విమానాలను అత్యవసరంగా దింపిన సందర్భాలున్నాయి. కానీ అమెరికాకు చెందిన ఓ విమానాన్ని మాత్రం ఓ కుక్క మలవిసర్జన చేయడం వల్లే అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది. విచిత్రమైన ఈ సంఘటన లాస్‌ఏంజెలిస్ నుంచి ఫిలడెల్ఫియా వెళుతున్న యూఎస్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానంలో ఇటీవల చోటుచేసుకుంది. తొలుత లాస్‌ఏంజెలిస్‌లో విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విమానం బయలుదేరడంతో కాస్త తెరిపిన పడ్డ ప్రయాణికులు తమ సీట్లలో కునుకులో పడ్డారు. అకస్మాత్తుగా భరించలేనంత దుర్వాసన రావడంతో మెలకువ వచ్చి అందరూ గగ్గోలుపెట్టారు. తీరా చూస్తే.. ఓ పెద్ద కుక్క విమానంలోనే పనికానిచ్చేసిందని అర్థమైంది.

వెంటనే సిబ్బంది దానిని తుడిచేశారు. అయితే కాసేపటికే మరోసారి.. దానినీ తుడిచేశాక మరికొద్దిసేపటికే ఇంకోసారీ ఆ కుక్క అక్కడే పనికానిచ్చేసింది. ఎంత శుభ్రం చేసినా వాసన మాత్రం పోలేదు. దీంతో విమానాన్ని కాన్సాస్ సిటీ విమానాశ్రయంలో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. తర్వాత మొత్తం శుభ్రం చే శాక విమానం తిరిగి బయలుదేరింది. ఆ కుక్కను, దాని యజమానిని మాత్రం తర్వాత వేరే విమానంలో పంపారట. అయితే తన కుక్క చేసిన పనికి దాని యజమాని సిగ్గుతో తలవంచుకోగా.. ఇంత పనికి కారణమైన ఆ కుక్కను ఫొటో తీసి ఒకరు ట్విట్టర్‌లో పెట్టారట.
 

Leave a Comment