కానుకనువేలం పెట్టిన నమ్రత

41402077101_625x300సామాజిక సేవా కార్యక్రమాల కోసం నటీనటులు తమకు తోచిన రీతిలో సాయపడడం తరచూ జరిగేదే. నటుడు మహేశ్‌బాబు భార్య, మాజీ నటి అయిన నమ్రతా శిరోద్కర్ సైతం ఇప్పుడు ఆ బాటపట్టారు. స్వతహాగా పెయింటింగ్‌ల సేకరణపై ఆసక్తి ఉన్న ఈ మాజీ మిస్ ఇండియా ఇప్పుడు తన దగ్గరున్న ప్రసిద్ధ వర్ణచిత్రాల్ని వేలం వేయిస్తున్నారు. అలా వచ్చిన సొమ్మును పిల్లల బాగు కోసం కృషి చేసే ‘హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్’ అనే సేవాసంస్థకు అందించనున్నారు.  ఈ నెల 27న జరగనున్న ‘బిడ్ అండ్ హ్యామర్’ వేలంలో తన దగ్గరున్న ప్రసిద్ధ కళాకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్‌ను విక్రయించాలని నమ్రత నిర్ణయించుకున్నారు.
 
దాదాపు పదిహేనేళ్ళ క్రితమే హుస్సేన్ సాబ్‌తో ఆమెకు పరిచయముంది. ‘‘ఆయన రూపొందించిన ‘గజగామిని’ చిత్రంలో మా అక్కయ్య శిల్పా శిరోద్కర్ నటించింది. ఆ సమయంలో ఆయన తరచూ వస్తూ ఉండేవారు. అలా అప్పుడు ఆయనను కలుసుకొంటూ ఉండేదాన్ని’’ అని నమ్రత గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన శిల్పకూ, నమ్రతకూ తన పెయింటింగ్‌లు కొన్ని కానుకగా ఇచ్చారు. ‘‘ఒకసారి పిచ్చాపాటీ మాట్లాడుతూ, ఆయన గీసిన బొమ్మ కావాలని అడిగాను. ఆ తరువాత కొద్ది రొజులకే ఆయన తాను గీసిన గుర్రపు బొమ్మల పెయింటింగ్‌ను కానుకగా ఇచ్చారు.
 
అంతేకాకుండా, ‘చినూకు… ప్రేమతో’ అని సంతకం పెట్టి మరీ ఇచ్చారు’’ అని ఈ మాజీ హీరోయిన్ వివరించారు. ‘సిగ్నిఫికెంట్ ఇండియన్ ఆర్ట్’ పేరిట ఈ నెలాఖరులో జరగనున్న వేలంలో దాన్ని నమ్రత విక్రయిస్తున్నారు. హుస్సేన్ గీసిన ఈ గుర్రాల సిరీస్ పెయింటింగ్‌లే కాక, 8వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్య కాలంలోని గొప్ప భారతీdownloadయ పెయింటర్లయిన నందలాల్ బోస్, రాధాదేవి గో
యెంకా లాంటి పలువురి వర్ణచిత్రాలను కూడా విక్రయించనున్నారు.

 
నిజానికి, ఇంటి గోడలకు పెయింటింగ్‌లు అలంకరించి పెట్టుకోవడమంటే నమ్రతకు ఇష్టం. అయితే, ఎప్పటికప్పుడు కొత్త పెయింటింగ్‌లు తెచ్చి, ఇంటిని కొత్తగా తీర్చిదిద్దుకోవడం ఈ మహారాష్ట్ర వనితకు అలవాటు. ఆ రకంగా ఎంతో మంది కళాకారుల వర్ణచిత్రాలను ఆమె సేకరించారు. ‘‘పేరొందిన ఈ వేలంలో పాల్గొనాల్సిందిగా మా మిత్రులు ఒకరు నాకు నచ్చజెప్పారు.
 
వేలం ద్వారా వచ్చిన సొమ్ము ‘హీల్ ఎ చైల్డ్’ ద్వారా సేవా కార్యక్రమాలకు వెళుతుంది కాబట్టి, నేను కూడా ఆనందంగా ఒప్పుకున్నాను’’ అని నమ్రత చెప్పారు. అన్నట్లు, మహేశ్‌బాబు సైతం ఈ సంస్థకు అండదండలందిస్తూ ఉంటారు. మొత్తానికి, సంపాదించి కూర్చోవడంతో సరిపెట్టుకోకుండా, వీలైనంత మేర సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ స్టార్ దంపతులు అనుకోవడం మంచి విషయమేగా!

Leave a Comment