కాల్చే ఎండలు.. కరెంటు కోతలు!

2యూపీలో విలవిల్లాడుతున్న ప్రజలు
సబ్‌స్టేషన్లపై దాడి; విద్యుత్ అధికారుల నిర్బంధం
మరో వారంపాటు ఇదే పరిస్థితంటున్న అధికారులు

 
లక్నో: భానుడి భగభగలతో ఉత్తర భారతం మండిపోతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీల్లో శనివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూపీలోని అలహాబాద్‌లో 48.3 డిగ్రీలు, లక్నోలో 47 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 47.3 డిగ్రీలతో గత 11 ఏళ్లలో రికార్డు ఉష్ణోగ్రత నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో 44.9 డిగ్రీల అత్యధిక.. 30.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. జూన్ 10 వరకు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో వేడిమి ఈ వేసవిలోనే అత్యధికంగా 46.8 డిగ్రీలుగా ఉంది. ఎడారి ప్రాంతం చురులో 47.6, బికనూర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత హిల్‌స్టేషన్ డెహ్రాడూన్‌లోనూ శనివారం ఎండలు మండిపోయాయి.

భరించలేని ఉష్ణోగ్రత, ఉక్కపోతలకు గంటల తరబడి విద్యుత్ కోతలు తోడవడంతో ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు అల్లాడుతున్నారు. మీరట్, వారణాసి, సుల్తాన్‌పూర్, కాన్పూర్ సహా దాదాపు రాష్ట్రమంతా శనివారం సగటు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. యూపీలోని గ్రామాల్లో 2 నుంచి 3 గంటలు, పట్టణాల్లో 10 – 12 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుచోట్ల ప్రజలు విధ్వంసానికి దిగారు. లక్నో దగ్గర్లోని ఒక సబ్‌స్టేషన్‌పై దాడిచేసి పలువురు ఉద్యోగస్తులను నిర్బంధించారు. గోరఖ్‌పూర్, గోండ ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను తగలబెట్టారు. యూపీలో సాధారణంగానే విద్యుత్ డిమాండ్ కన్నా సరఫరా తక్కువగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పుడు డిమాండ్ మరింత పెరగడంతో అనధికార కోతలను అధికారులు అమలు చేస్తున్నారు. మరో వారంపాటు విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోవచ్చని ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ప్రకటించింది. మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. వాటికి తోడు తీవ్రస్థాయి వేడిగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం శనివారం తేలికపాటి వర్షాలు కురిశాయని నాగ్‌పూర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. షాజపూర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.

Leave a Comment