కెటిఆర్ ఇంకా దూరమే, కేబినెట్‌కు డుమ్మా

ktr

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కల్వకుంట్ల తారకరామారావు పది రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సచివాలయానికి కూడా రావడం లేదు. పైగా, శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరుకాలేదు.

మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై పార్టీలోనూ బయటా విస్తృతంగా చర్చ సాగుతోంది. తండ్రి కెసిఆర్‌పై ఆయన అలక వహించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, అది ఎంత వరకు నిజమనేది తెలియడం లేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణపై కెటిఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగింది. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి కూడా కెటిఆర్ హాజరు కాలేదు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు.

హైదరాబాదులో ఉండి కూడా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన గైర్హాజర్ అయ్యారు. కెసిఆర్‌పై అలక వహించిన కారణంగానే ఆయన మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో కెసిఆర్‌కు ఇంటిపోరు ప్రారంభమైందనే ఊహాగానాలు చెలరేగాయి. దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆయన 15వ తేదీ రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మర్నాడు ఉదయం ఆయన రాజభవన్‌కు రాకపోవడం మాత్రం చర్చనీయాంశంగానే మారింది. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు మంత్రి పదవులు ఇవ్వడంపై కెటిఆర్ ఆసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, పార్టీకోసం కష్టపడిన కొప్పుల ఈశ్వర్ వంటివారిని కెసిఆర్ విస్మరించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అయితే, కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీబాధ్యతలు కూడా చేపట్టారు. మహిళలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం కెటిఆర్‌కు నచ్చడం లేదని అంటున్నారు. మంత్రివర్గంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చినవారే ఎక్కువ మంది ఉండడం కూడా ఆయన అసంతృప్తికి కారణమని చెబుతున్నారు. జంపింగ్‌లకు మంత్రి పదవి దక్కేలా లాబీయింగ్ జరిగిందని కెటిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

శ్రీనివాస యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వడానికి అంతగా తొందరపడాల్సిన అవసరం ఏముందని కెటిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని, ఆరు నెలల్లోగా ఎన్నికలు జరిగితే అందులో తలసాని ఓడిపోతే, శాసనమండలికి ఎంపిక చేయాల్సి వస్తుందని, ఇంత కసరత్తు అవసరమా అని కెటిఆర్ అంటున్నట్లు చెబుతున్నారు.

మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కెటిఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్‌, కొండా సురేఖ, శ్రీనివాస్‌గౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్థన్‌, జలగం వెంకట్రావు, బిగాల గణేష్‌ గుప్తా తదితరులు గైర్హాజరయ్యారు. ఏ పదవీ దక్కని ఏనుగు రవీందర్‌రెడ్డి, విప్‌ పదవి అయినా దక్కుతుందని ఆశించి భంగపడ్డ గణేష్‌ గుప్తా కూడా గైర్హాజరయ్యారు.

 

Leave a Comment