కోల్‌కతా ఫైనల్‌కి…

6క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఘన విజయం   
 రాణించిన ఉతప్ప, ఉమేశ్
 
 సంచలనాల మీద నిలకడదే పైచేయి. ఐపీఎల్-7లో లీగ్ దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లే రేసులో నిలబడ్డాయి. ఒకే ఒక్క మ్యాచ్‌లో పెను విధ్వంసం ద్వారా నాకౌట్‌కు చేరిన ముంబై కథ ఎలిమినేటర్‌లోనే ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ నైపుణ్యం ముందు ముంబై తేలిపోయింది. ఇక వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న కోల్‌కతా… క్వాలిఫయర్‌లోనూ ఏ మాత్రం తడబాటు లేకుండా పంజాబ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. పంజాబ్ ఓడినా లీగ్ దశలో నిలకడ పుణ్యమాని ఫైనల్‌కు చేరడానికి మరో అవకాశం ఉంది. ఇక క్వాలిఫయర్-2లో చెన్నైతో పంజాబ్ అమీతుమీ తేల్చుకోనుంది.
 
 కోల్‌కతా: లీగ్ ఆరంభంలో తొలి ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చివర్లో మాత్రం అద్భుతాలు చేసింది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గి నాకౌట్‌కు చేరుకోవడంతో పాటు క్వాలిఫయర్‌లోనూ సంచలనం సృష్టించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో  చెలరేగుతూ వస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కట్టడి చేసి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
 
 వర్షం అంతరాయం మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బెయిలీసేన ఏ దశలోనూ కోల్‌కతాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా… బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది.
 
 ఉతప్ప (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పాండే (20 బంతుల్లో 21; 3 ఫోర్లు), యూసుఫ్ పఠాన్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) సూర్యకుమార్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కరణ్‌వీర్ 3 వికెట్లు, జాన్సన్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. సాహా (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ వోహ్రా (19 బంతుల్లో 26; 3 సిక్సర్లు), బెయిలీ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమేశ్ 3, మోర్కెల్ 2 వికెట్లు తీశారు.
 ఉతప్ప జోరు…
 గంభీర్ (1) రెండో ఓవర్‌లోనే అవుట్ కావడంతో కోల్‌కతా ఆరంభంలో కాస్త తడబడింది. అయితే ఉతప్ప, మనీష్ పాండేలు వికెట్‌ను కాపాడుకుంటూనే వేగంగా ఆడారు. దీంతో పవర్‌ప్లేలో గౌతీసేన వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
 
 మెరుగైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఆదుకున్న ఈ జోడిని అక్షర్ పటేల్ దెబ్బతీశాడు. 9వ ఓవర్‌లో నాలుగు బంతుల వ్యవధిలో ఇద్దర్ని అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 42 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.   
 
 క్రీజులో ఉన్న షకీబ్ (16 బంతుల్లో 18; 2 ఫోర్లు), యూసుఫ పఠాన్ నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు.
 
 15వ ఓవర్‌లో కరణ్‌వీర్…. వరుస బంతుల్లో షకీబ్, యూసుఫ్‌లను అవుట్ చేశాడు. ఈ ఇద్దరు  నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు.
 
 జట్టు స్కోరు 113/5 ఉన్న దశలో 25 నిమిషాల పాటు వర్షం అంతరాయం కలిగించింది. తర్వాత సూర్యకుమార్, టెన్ డస్కెట్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 21 బంతుల్లో 37 పరుగులు జోడించి వెంటవెంటనే అవుటైనా కోల్‌కతా మాత్రం పోరాడే స్కోరును సాధించింది.
 
 తడబడుతూ…
 ఓపెనర్లలో సెహ్వాగ్ (2) వెంటనే అవుటైనా.. వోహ్రా ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఫలితంగా పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరు 46/2.
 
 సాహా నిలకడను కనబర్చినా… ఉమేశ్ నాణ్యమైన బంతితో మాక్స్‌వెల్ (6)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పంజాబ్ 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
 
 వ్యక్తిగత స్కోరు ఒక పరుగు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మిల్లర్ (8).. సాహాతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మూడు బంతుల తేడాతో ఈ ఇద్దరు అవుటయ్యారు. కొద్దిసేపటికే అక్షర్ పటేల్ (2) కూడా వెనుదిరిగడంతో పంజాబ్ 87 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది.
 
 చివర్లో బెయిలీ, ధావన్ (14), జాన్సన్ (10 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమి తప్పలేదు.
 
 స్కోరు వివరాలు
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మిల్లర్ (బి) పటేల్ 42; గంభీర్ (సి) బెయిలీ (బి) జాన్సన్ 1; పాండే (బి) పటేల్ 21; షకీబ్ (సి) మిల్లర్ (బి) కరణ్‌వీర్ 18; యూసుఫ్ (సి) మిల్లర్ (బి) కరణ్‌వీర్ 20; టెన్ డస్కెట్ (సి) వోహ్రా (బి) జాన్సన్ 17; సూర్య కుమార్ (బి) కరణ్‌వీర్ 20; చావ్లా నాటౌట్ 17; నరైన్ రనౌట్ 0; మోర్కెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163.
 
 వికెట్ల పతనం: 1-2; 2-67; 3-67; 4-108; 5-108; 6-145; 7-147; 8-159.
 బౌలింగ్: అవానా 4-0-33-0; జాన్సన్ 4-0-31-2; అక్షర్ పటేల్ 4-1-11-2; రిషీ ధావన్ 4-0-44-0; కరణ్‌వీర్ 4-0-40-3.
 
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) షకీబ్ (బి) ఉమేశ్ 2; వోహ్రా (సి) ఉమేశ్ (బి) మోర్కెల్ 26;  సాహా (సి) ఉమేశ్ (బి) మోర్కెల్ 35; మాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 6; మిల్లర్ (బి) చావ్లా 8; అక్షర్ పటేల్ రనౌట్ 2; బెయిలీ (సి) పాండే (బి) ఉమేశ్ 26; ధావన్ (స్టంప్డ్) ఉతప్ప (బి) షకీబ్ 14; జాన్సన్ నాటౌట్ 10; కరణ్‌వీర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 135.
 
 వికెట్ల పతనం: 1-5; 2-45; 3-55; 4-80; 5-82; 6-87; 7-117; 8-134
 బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-23-2; ఉమేశ్ 4-0-13-3; నరైన్ 4-0-30-0; షకీబ్ 4-0-43-1; చావ్లా 4-0-23-1.

Leave a Comment