క్లీన్‌స్వీప్ లక్ష్యం

India Team– మరో గెలుపుపై భారత్ కన్ను
– పరువు కోసం బంగ్లాదేశ్ పోరాటం
– నేడు చివరి వన్డే

మిర్పూర్: స్టార్ ఆటగాళ్లు లేకపోయినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో గెలుపుతో పర్యటనలో పరిపూర్ణ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాతో గురువారం జరిగే చివరి వన్డేలో టీమిండియా తలపడనుంది. మరో వైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్, చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. తొలి వన్డేలో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన భారత్, రెండో వన్డేలో అద్భుత బౌలింగ్‌తో నిలబడింది. పిచ్ ఎంత బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా 105 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అసాధారణమే.

ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మరోవైపు బంగ్లాదేశ్ 2014లో 9 వన్డేలు ఆడినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చివరకు అఫ్ఘనిస్థాన్ చేతిలోనూ ఓడింది. చాలా కాలంగా ప్రదర్శన తీవ్రంగా దిగజారుతూ వస్తున్న ఈ జట్టు భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. 58 పరుగులకే కుప్పకూలడం పట్ల ఆ దేశ అభిమానుల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు జట్టు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ తమ జాతి ప్రజలకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో ఆ జట్టుకు తాజా మ్యాచ్ ప్రాణసంకటమే.

Leave a Comment