క్వార్టర్స్‌లో నాదల్

8ఫై కూడా…    ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఎనిమిది సార్లు చాంపియన్ రఫెల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 6-1, 6-2, 6-1 తేడాతో సెర్బియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు డూసాన్ లాజోవిక్‌పై వరుస సెట్లలో గెలుపొందాడు. దీంతో రోలాండ్ గారోస్‌లో నాదల్ వరుసగా 32వ మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఐదోసారి టైటిల్ వేటలో ఉన్న స్పెయిన్ బుల్ ధాటికి లాజోవిక్ ఏ దశలోనూ నిలవలేకపోయాడు. తనకు అచ్చొచ్చిన ఎర్రమట్టి కోర్టులో మరోసారి చెలరేగిన రఫా.. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుసగా 17 పాయింట్లు సొంతం చేసుకున్నాడు.

రెండో సెట్‌లో నాదల్ 4-0 ఆధిక్యంలో ఉన్న దశలో లాజోవిక్ రెండు గేమ్‌లు గెలిచినా చివరికి నాదల్ దూకుడు ముందు తలవంచక తప్పలేదు. మూడో గేమ్‌నూ ఏకపక్షంగా మార్చిన నాదల్ 93 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. మంగళవారం 28వ పుట్టినరోజు జరుపుకోనున్న నాదల్.. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ డేవిడ్ ఫై (స్పెయిన్)తో తలపడనున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫై 6-3, 6-3, 6-7 (5/7), 6-1తో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ అండర్సన్‌ను ఓడించాడు.

గత ఏడాది ఫైనల్‌ల్లో ఫై.. నాదల్ చేతిలోనే ఓటమిపాలయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఫై కేవలం ఎనిమిది గేమ్‌లు మాత్రమే గెలుచుకోగలిగాడు. కెరీర్‌లో ఇరువురి మధ్య పోరులో నాదల్ 21-6 తిరుగులేని ఆధిపత్యంలో ఉన్నాడు. ఇక మరో ప్రిక్వార్టర్స్‌లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే 6-4, 7-5, 7-6 (7/3) తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై గెలుపొంది క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ముర్రేకు ఫ్రెంచ్ ఓపెన్‌లో 2011లో సెమీఫైనల్‌కు చేరడమే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శన.

ఎరానితో పెట్కోవిక్ ఢీ
మహిళల సింగిల్స్‌లో పదో సీడ్ సారా ఎరాని (ఇటలీ), ఆండ్రియా పెట్కోవిక్ (జర్మనీ), సిమోనా హాలెప్ (రొమేనియా)లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ హాలెప్ 6-4, 6-3 తేడాతో అమెరికాకు చెందిన స్లోన్ స్టీఫెన్స్‌పై, ఎరాని 7-6 (7/5), 6-2తో ఆరోసీడ్ జెలెనా జంకోవిక్ (సెర్బియా)పై గెలుపొందారు. పెట్కోనిక్ 1-6, 6-2, 7-5తో కికీ బెర్టెన్స్‌పై నెగ్గింది. ఇక సెమీస్ బెర్తు కోసం పెట్కోవిక్.. ఎరానితో తలపడనుంది.పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ జోడి ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం స్పెయిన్ జంట మార్సెల్ గ్రానోలర్స్-మార్క్ లోపెజ్ చేతిలో బ్రయాన్ కవల సోదరులు 4-6, 2-6 తేడాతో ఓటమి పాలయ్యారు.

Leave a Comment