గంభీర్‌కు పిలుపు

7ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు ఎంపిక  
 బంగ్లాతో వన్డేలకు కెప్టెన్‌గా రైనా
 
 ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు: ధోని (కెప్టెన్), విజయ్, ధావన్, గంభీర్, పుజారా, కోహ్లి, రహానే, రోహిత్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఈశ్వర్ పాండే, ఇశాంత్, స్టువర్ బిన్ని, ఆరోన్, సాహా, పంకజ్ సింగ్.బంగ్లాదేశ్‌తో వన్డేలకు భారత జట్టు: రైనా(కెప్టెన్), ఉతప్ప, రహానే, పుజారా, రాయుడు, మనోజ్ తివారి, కేదార్ జాదవ్, సాహా, పర్వేజ్ రసూల్, అక్షర్ పటేల్, వినయ్, ఉమేశ్, బిన్ని, మోహిత్, అమిత్ మిశ్రా.
 
 ముంబై: భారత జట్టులో స్థానం కోసం దాదాపు ఏడాదిన్నరగా గౌతమ్ గంభీర్ చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఇంగ్లండ్ పర్యటనకు భారత సెలక్షన్ కమిటీ ప్రకటించిన టెస్టు జట్టులో గంభీర్‌కు చోటు దక్కింది. గత ఏడాది జనవరిలో చివరిసారిగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిన గంభీర్ ఫామ్ లేమి కారణంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటడం గంభీర్‌కు కలిసొచ్చింది.
 
  ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్ని, రాజస్థాన్ పేసర్ పంకజ్‌సింగ్ ఆశ్చర్యకరంగా జట్టులోకి ఎంపికయ్యారు. సీనియర్ బౌలర్ జహీర్‌కు జట్టులో స్థానం దక్కలేదు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన  సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంతకుముందేన్నడూ లేని విధంగా 18 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. సెహ్వాగ్, హర్భజన్‌లకు చోటు దక్కలేదు. ధోని సారథ్యంలోని జట్టులో ఆరుగురు పేసర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఒక స్పిన్నర్, ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, ఒక బ్యాకప్ వికెట్ కీపర్ ఉన్నారు.  జూన్ 26 నుంచి సెప్టెంబర్ 7 వరకు సాగే ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ముందుగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొంటుంది.
 
 వన్డేలకు ఐపీఎల్ స్టార్లు
 బంగ్లాదేశ్‌లో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఐపీఎల్ స్టార్లకు చోటు దక్కింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు సీనియర్లు ధోని, కోహ్లి, రోహిత్, అశ్విన్, జడేజాలకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. రైనా సారథ్యంలోని 15 మంది సభ్యుల భారత జట్టులో… ఐపీఎల్‌లో రాణించిన రాబిన్ ఉతప్ప, పర్వేజ్ రసూల్, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్‌లకు జట్టులో స్థానం లభించింది.  న్యూజిలాండ్ పర్యటనలో వన్డే జట్టులో స్థానం కూడా లేని రైనాను ఏకంగా కెప్టెన్‌గా చేయడం విశేషం. హైదరాబాదీ రాయుడు కూడా చోటు నిలబెట్టుకున్నాడు.

Leave a Comment