ఘోర పరాజయానికి కారణాలేంటి?

3సీపీఎం కేంద్ర కమిటీ భేటీలో వాడివేడి చర్చ రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి! న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై శనివారం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. రాజకీయంగాను, ఎన్నికల సందర్భంలోనూ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాత్మక మార్గంపై చర్చ కేంద్రీకృతమైందని పార్టీ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పొలిట్‌బ్యూరొ సభ్యుడు సీతారాం ఏచూరి, పశ్చిమబెంగాల్‌కు చెందిన పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు తమ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. అయితే, ఆ విషయాన్ని పార్టీ నేతలు ధ్రువీకరించలేదు. తక్షణమే పార్టీలో నాయకత్వ మార్పు జరగాలని ఇటీవల బహిషృ్కత సీపీఎం నేత సోమ్‌నాథ్ చటర్జీ డిమాండ్ చేసిన నేపథ్యంలో.. సీనియర్ నేతలు రాజీనామాకు సిద్ధపడ్డారని సమాచారం. ‘కాంగ్రెసేతర, బీజేపీ వ్యతిరేక’ రాజకీయ మార్గంపై కేంద్రకమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో 89 మంది సభ్యులు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీనతలపై కేంద్రకమిటీ భేటీలో తొలిరోజు లోతైన చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం కేవలం 9 స్థానాల్లోనే గెలుపొందింది.

Leave a Comment