చంద్రబాబును నిలదీసిన వ్యక్తికి కేసీఆర్ ఇల్లు, కూతుళ్లకు 10 లక్షలు

kcr-mallaya

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నిలదీసిన ఫణికర మల్లయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా కష్టాలు తీరుతాయంటూ నాడు చంద్రబాబు ముందు మల్లయ్య కుండబద్దలు కొట్టారు.

మల్లయ్యకు పక్కా ఇంటితోపాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. శనివారం వరంగల్‌లో జరిగిన ప్రజా దర్బార్‌లో మల్లయ్యకు చేయూతనందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హన్మకొండ హంటర్‌ రోడ్‌లోని మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతా రావు నివాసంలో శనివారం ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వాటిని పరిశీలించి, పరిష్కారానికి అక్కడిక్కడే ఆదేశాలు జారీ చేశారు.

సాయం కోసం మల్లయ్య కూడా కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో బయట నిలుచుండిపోయారు. ఆయనను తెరాస నాయకులు గుర్తించి కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. మల్లయ్య సమర్పించిన వినతి పత్రాన్ని కేసీఆర్‌ పరిశీలించారు.

కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్లయ్య తన ఆర్థిక పరిస్థితిని వివరించారు. కేసీఆర్‌ అప్పటికప్పుడు స్పందించారు. ఆయనకు పక్కా ఇల్లుతోపాటు ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. దీనిపై అక్కడే ఉన్న కలెక్టర్‌ కిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మల్లయ్య సొంత ఊరు. 2008లో చంద్రబాబు మీకోసం యాత్ర సందర్భంగా వరి కల్లంలో కూలి పని చేస్తున్న మల్లయ్య దగ్గరకు చంద్రబాబు వెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం కార్యక్రమాలపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏం కావాలన్నారు. దాంతో మల్లయ్య తెలంగాణ కావాలన్నారు. అప్పటి నుండి ఫణికర మల్లయ్య తెలంగాణలో బాగా తెలిసిపోయింది.

కేసీఆర్ తనకు ఇల్లు మంజూరు చేసిన అనంతరం మల్లయ్య మాట్లాడుతూ… కేసీఆర్ స్వయంగా తనతో మాట్లాడటం సంతోషంగా ఉందని, తన రెండో కూతురు రేణుక డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోందని, మూడో కూతురు పదో తరగతి చదువుతోందని, రెండో కూతురుకు ఉద్యోగం ఇప్పించాలని కేసీఆర్‌ను కోరినట్లు చెప్పారు.

Leave a Comment