జంట నగరాలుగా విజయవాడ-గుంటూరు

2విజయవాడ-గుంటూరు-తెనాలి, విశాఖకు మెట్రో రైలు   కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
 
వంద స్మార్ట్ నగరాల అభివృద్ధి ప్రథమ కర్తవ్యం
2020 నాటికి అందరికీ ఇళ్ల నిర్మాణం
పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య

 
న్యూఢిల్లీ: విశాఖ నగరానికి మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోనూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో విజయవాడ-గుంటూరును జంట నగరాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు. దేశంలో కొత్తగా వంద స్మార్ట్, సురక్షిత నగరాలను నిర్మించడమే తన ప్రధాన కర్తవ్యమని వెంకయ్య తెలిపారు. బుధవారం ఉదయం ఆయన ఇక్కడి నిర్మాణ్ భవన్‌లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పనితీరును, కీలకాంశాలను వె ంకయ్యకు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణ, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం స్థానంలో త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 2020 నాటికి దేశంలో అందరికీ ఇళ్ల నిర్మాణం అనేది తమ అజెండాలో మరో ప్రాధాన్య అంశంగా వివరించారు. ఇందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో పాటు సామాజిక బాధ్యత కింద వాణిజ్య సంస్థలు అందించే సాయాన్ని కూడా స్వీకరిస్తామని చెప్పారు.

వాణిజ్య సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి విరివిగా ఇంటి రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నగరాల్లో అత్యుత్తమ పారిశుధ్య వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, నీటి పునర్వినియోగం, పబ్లిక్, వాణిజ్య సముదాయాల్లో వై-ఫై సౌకర్యాల కల్పన వంటి వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) ఆధారంగా పట్టణాభివృద్ధికి అత్యున్నత, శాస్త్రీయ పద్ధతులను వినియోగిస్తామని వెంకయ్య చెప్పారు. ప్రస్తుతం చెన్నై, బెంగుళూరు, కొచ్చిన్ నగరాల్లో జరుగుతున్న మెట్రో రైలు పనులను వేగవంతం చేస్తామని, మరిన్ని నగరాల్లో మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పిస్తామని వివరించారు. ఇక దేశంలోని అన్ని ఆధ్యాత్మిక నగరాలను శుద్ధి చేసి అవి యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని వెంకయ్య తెలిపారు. పట్టణాల్లోని మురికి వాడల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆరోగ్య, విద్యా శాఖలతోనూ సమావేశాలు జరుపుతానని వివరించారు. పట్టణాల్లో నివాస గృహం లేని వారికి జాతీయ పట్టణ ఆవాస యోజన పథకం ద్వారా చేయూతనిస్తామన్నారు.

 ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్

పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంకయ్యనాయుడు పార్లమెంట్ హౌజ్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలను కూడా స్వీకరించారు. స్పీకర్ ఎన్నిక జరిగేంత వరకు ప్రోటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కమల్‌నాథ్ వ్యవహరిస్తారని వెల్లడించారు.

Leave a Comment