జగన్.. కాస్త అంబటికి చెప్పకూడదూ..!

రాజకీయాల్లో ప్రతిపక్షానికి ప్రత్యేకస్థానముంది.. చేతిలో అధికారం లేకపోయినా.. అధికారపక్షం నడ్డివిరిచే చక్కని అవకాశం ఎప్పుడూ విపక్షం చేతిలో ఉంటుంది. ప్రజారంజక పాలన ఏ పార్టీకైనా కత్తిమీద సామే.. పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ.. సర్కారును సన్మార్గం దిశగా నడిపించేందుకు ప్రతిపక్షం కృషి చేస్తే ప్రజలకూ మేలు జరుగుతుంది. ఏపీలో మాత్రం ఈ విషయంలో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ ఆ దిశగా పెద్దగా మార్కులు కొట్టేయడం లేదు. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించిన వారికే అధికారం అనుభవించే హక్కు ఉంటుందని చరిత్ర చెబుతోంది. విమర్శించడం తమ హక్కు కదా.. అని ప్రతి విషయాన్ని విమర్శిస్తూ పోతే.. ప్రజల్లో విశ్వాసం కోల్పోతామన్న సంగతి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గ్రహిస్తున్నట్టు లేరు. కొత్త రాజధాని నిర్మాణం కోసం.. పెట్టుబడులు సాధించడం కోసం ఏపీ ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. దీనిపై ఆ పార్టీ నేత అంబటి రాంబాబు గుప్పించిన విమర్శలు.. ఆ పార్టీ స్థాయిని తగ్గించేలా ఉన్నాయి. హుద్ హుద్ తుపాను వంటి కష్టాలతో రాష్ట్రం ఇబ్బందిపడుతోంటే.. కోట్లు ఖర్చుపెట్టి విహారయాత్రలు అవసరమా అంటూ ఆయన విమర్శించారు. రెండు ప్రత్యేక విమానాల్లో సింగపూర్ వెళ్లారని.. రాష్ట్రాభివృద్ధికి కాక.. సింగపూర్లోని తన వ్యాపారాలు చూసుకోవడానికే వెళ్లారని అంబటి ఆగ్రహం వెళ్లగక్కారు. చంద్రబాబు కొడుకు, కోడలు సింగపూర్లోనే వ్యాపారాలు చేస్తున్నారని.. ఆయన తన పేరు సింగపూర్ నాయుడిగా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. సింగపూర్లో చంద్రబాబు ఏం చేస్తున్నారు.. ఎవరెవరికి కలుస్తున్నారని.. అనే అంశాలపై దర్యాప్తు సంస్థ రా తో నిఘా పెట్టించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా విమర్శించే సదవకాశాన్ని అంబటి ఇలా దుర్వినియోగం చేస్తే.. పార్టీకి నష్టమని జగన్ ఆయనకు సలహా ఇస్తే మేలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment