జగన్ మైండ్‌బ్లాంక్: వైఎస్ గెలుపుపై రాజేంద్ర ప్రసాద్ ప్రశ్న

హైదరాబాద్: పదహారు నెలలు జైల్లో ఉండి rajendraprasadవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సగం మైండ్ పోయిందని.. ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా సగం కూడా పోయి.. మైండ్ బ్లాంక్ అయిపోయిందని టిడిపి అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ గురువారం మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులా దొంగ హామీలు ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రిని అయ్యేవాడినని ఇడుపులపాయలో జగన్ వ్యాఖ్యానించారని, ఇవి నిరాశా నిస్పృహలతో చేస్తున్న వ్యాఖ్యలన్నారు. ఐదు సంతకాలు చేస్తానంటూ జగన్ హామీలిచ్చారని, ఆయన హామీలిస్తే సరైనవి, ఇతరులిస్తే సరైనవి కావా అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన వారు.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ఆత్మ పరిశీలన చేసుకుంటామని, విజేతలకు అభినందనలు అని తొలుత చెప్పడం ఆనవాయితీ అని ఈ విషయంలో కూడా జగన్‌కు విజ్ఞత, సంస్కారం లేకుండా పోయిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 1.9 శాతం ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయామని, ఇది ఓటమి కాదని జగన్ చెప్పడాన్ని తప్పుబట్టారు. 2009 ఎన్నికల్లో నీ తండ్రి 1.8 శాతం ఓట్ల తేడాతోనే గెలిచారని, అంటే నీ తండ్రి గెలిచినట్లు కాదని అంగీకరిస్తున్నావా? అని ప్రశ్నించారు. జగన్‌ది, కెసిఆర్‌ది ఒకే డీఎన్ఏ అని, 2009లో కౌంటింగ్ జరగకుండానే కెసిఆర్ కురుక్షేత్ర ర్యాలీకి వెళ్లి బిజెపికి మద్దతు ప్రకటించారన్నారు. ఇప్పుడు జగన్ కూడా మోడీకి మద్దతు ప్రకటించారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే సంస్కారం కూడా జగన్‌కు లేదన్నారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని అధికారం కోసం పాకులాడటమేనా జగన్‌కు తెలిసిన విశ్వసనీయత అంటూ ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీలను టిడిపి చేయకూడదనే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నాయన్నారు. 

Leave a Comment