జయం రవితో కాజల్!

Kajal Agarwalచార్మింగ్ హీరో జయం రవితో జత కట్టడానికి రెడీ అవుతున్నారు అందాల భామ కాజల్ అగర్వాల్. ఈ మధ్య కాస్త మార్కెట్ డౌన్ అయ్యిందనే ప్రచారం జరుగుతుండగానే కాజల్ అగర్వాల్ మళ్లీ తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఏడాది తరువాత మళ్లీ బాలీవుడ్‌లో అవకాశం సంపాదించుకున్న ఈ బ్యూటీ తమిళ చిత్ర పరిశ్రమపైనా దృష్టి సారిస్తున్నారు. కమల్ హాసన్ సరసన నటించే అవకాశం చేజారిపోయినా ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం.

జిల్లా వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత కాజల్ నటించే తమిళ చిత్రం కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో కాజల్ అగర్వాల్ ధనుష్ సరసన ఒక చిత్రం చేయడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించనున్నారు. మరో చిత్రంలో జయం రవితో జతకట్టడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం జయం రవి తన సోదరుడు జయం రాజా దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్. దీంతోపాటు రోమియో జూలియట్ అనే మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక జోడి. ఇక కాజల్‌తో డ్యూయెట్లు పాడే చిత్రాన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Leave a Comment