జాతీయాధ్యక్షుడు చంద్రబాబు

తెలుగుదేశం తొలి సభ్యుడిగా చంద్రబాబు సోమవారం పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. చంద్రబాబు పార్టీ సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీలో 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకునే ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమవుతుంది. 25లక్షల మంది సభ్యులకూ ప్రమాద బీమా కల్పిస్తూ ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో తెదేపా శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్స్యూరెన్స్ కంపెనీ చీఫ్ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ నేతృత్వంలోని బృందం తెదేపా కార్యకర్తల సంక్షేమ సంస్థ కన్వీనర్ నారా లోకేష్‌ను కలిసి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలో 25 లక్షలమందితో కూడిన గ్రూప్‌నకు ఇన్స్యూరెన్స్ చేయడం ఇదే ప్రథమమని ఈ సందర్భంగా రాజశేఖర్ పాత్రికేయులకు చెప్పారు. వంద రూపాయిలు చెల్లించి పార్టీలో చేరిన వారికి ప్రమాద బీమా ఉంటుంది. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు రెండు లక్షల రూపాయిలు, గాయపడిన వారికి 50వేలు బీమా దక్కుతుంది.  పార్టీ సభ్యత్వ రుసుంతోపాటు అదనంగా బీమా కల్పించడం ద్వారా తమ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని నారా లోకేష్ చెప్పారు. తెలంగాణ ఎన్నికల కమిటీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి, ఆంధ్రా ఎన్నికల కమిటీ ఇన్‌ఛార్జిగా కళా వెంకటరావు నియమితులయ్యారు. ఆంధ్ర ప్రాంతంలోని 14 జిల్లాలకు (పార్టీ జిల్లాలు) కళావెంకటరావు ఇన్‌ఛార్జి కన్వీనర్లను నియమించారు. అలాగే తెలంగాణ ప్రాంతంలోనూ కమిటీ సిద్ధమైంది. నవంబర్ 3 ఉదయం ఆన్‌లైన్ ద్వారా, సెల్‌ఫోన్ యాప్స్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సభ్యత్వ నమోదు చేపడతారు. మరోపక్క 1600 మంది ఐటి నిపుణులు సభ్యత్వ నమోదు సపోర్టింగ్ స్ట్ఫాగా ఉంటారు. ఐవిఆర్‌ఎస్ వ్యవస్థను కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఐవిఆర్‌ఎస్‌కు ఫోన్ చేసి చెబితే చాలు వివరాలు నమోదు చేసుకుని నేరుగా నిపుణులు వారి వద్దకెళ్లి సభ్యత్వాన్ని అందిస్తారు. సాంకేతిక వ్యవస్థ పనితీరును కుప్పం నియోజకవర్గంలో పరిశీలించామని అది విజయవంతమైందని నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా లక్షలాది కార్యకర్తలు ఉన్నారని, ప్రస్తుతం 18 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్నారని వివరించారు. 15 ఏళ్లు నిండిన వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరవచ్చని తెలిపారు. 2019 నాటికి వారికి 18ఏళ్లు నిండుతాయని , ఆ విధంగా వారు ఓటర్లుగా మారతారన్నారు.

Leave a Comment