నల్గొండ: నందమూరి జానకిరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్న తీవ్ర పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. ఆవేదనకు లోనయ్యాడు. తాను కూడా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటే ఎంతో బాగుండేదని అన్నాడు. తాను స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానిని అని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని వ్యాఖ్యానించాడు. నందమూరి కుటుంబ సభ్యుడు జానకిరాం ప్రమాదంలో మృతి చెందడం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని అతను చెప్పాడు. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు. కాగా, వెంకన్న మునగాల పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
కాగా, జానకిరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎందరినో కలిచివేసింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే ప్రాణాలు తీసింది. బెల్ట్ పెట్టుకుంటే గాయాలైనా కనీసం ప్రాణాలు దక్కేవని పోలీసులు చెబుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగానే ఇటీవలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఎర్రంనాయుడు మృతి చెందారు. అలాగే, జానకిరాం మృతికి సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే కారణమంటున్నారు. అదేవిధంగా సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగానే టీడీపీ సీనియర్‌నేత లాల్ జాన్ బాషా ప్రాణాలు కోల్పోయారు. సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగానే మునగాల మండలం ఆకుపాముల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరాం మృతి చెందారు. ఏడాదిక్రితం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి సమీపంలో అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. సీటు బెల్ట్ పెట్టుకోకుండా ముందు సీట్లో కూర్చొన్న లాల్ జాన్ బాషా అక్కడికక్కడే మృతి చెందారు. 2009లో మోతె మండలం తిరుపతమ్మగుడి వద్ద కారు అదుపుతప్పిన ఘటనలో జూనియర్ ఎన్టీఆర్ నడుపుతున్న వాహనం బోల్తాపడింది. జూనియర్ ఎన్టీఆర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. 2011 డిసెంబరు ఆఖరివారంలో మెదక్ జిల్లా కొల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.
Recent Comments