జిల్… జిల్… బ్రె‘జిగేల్’

corinthians stadiumక్లుప్తంగానే అయినా ఆకట్టుకున్న ప్రారంభోత్సవం  
 ఇక 32 రోజులు ఫుట్‌బాల్ పండగ
 
 సావో పాలో: బ్రెజిల్ జిగేల్‌మంది. అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన సాకర్ సంబురం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సావో పాలోలోని ఎరీనా కొరింథియాన్స్ స్టేడియంలో ఆరు వందల మంది కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆరంభ వేడుకల్లో అదరగొట్టారు. కేవలం 25 నిమిషాల పాటే క్లుప్తంగా నిర్వహించినా… ప్రారంభోత్సవం ఆకట్టుకుంది. విశేషాలు…
 
 వేడుకల్లో భాగంగా మైదానం మధ్యలో ‘లివింగ్’ బాల్ పేరిట భారీ ఎల్‌ఈడీ బంతిని ఉంచారు.  
 
 ‘ప్రకృతి, ప్రజలు, ఫుట్‌బాల్’ పేరిట ఆరంభ కార్యక్రమాలను రూపొందించారు.
 దీంట్లో భాగంగా ముందుగా ప్రకృతిని తలపిస్తూ పూలు, చెట్ల వేషధారణలో కళాకారులు తమ అభినయాన్ని చాటుకున్నారు.
 
 అనంతరం తమ సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టుగా చూపారు. ప్రేమైక జీవితం, భిన్నత్వం, సంగీతం.. నృత్యంపై తమకు గల మక్కువను చాటుకున్నారు.
 ఇక ఫుట్‌బాల్ అంటే తమకు ఎంత మక్కువో అద్భుత విన్యాసాలతో చాటి చెప్పారు. ఇందులో అందరూ చిన్నారులే పాల్గొనడం విశేషం.
 
 చివర్లో బంతి ఆకారం పువ్వులా విచ్చుకుని అందులో నుంచి ముందుగా బ్రెజిల్ సింగర్ క్లాడియా లెట్టీ, ఆ తర్వాత పిట్‌బుల్, జెన్నిఫర్ లోపెజ్ వచ్చి ఫిఫా అధికారిక గీతం ‘వి ఆర్ వన్’ సాంగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు.
 
 ప్రారంభ కార్యక్రమాలు, ఆరంభ మ్యాచ్ కోసం సావో పాలోలో అధికారికంగా సెలవును ప్రకటించారు. బ్రెజిల్ జట్టు బస చేసిన హోటల్ గది బయట తెల్లవారుజాము నుంచే అభిమానులు క్యూ కట్టారు.
 
 ప్రపంచకప్ ఫుట్‌బాల్ మేనియాతో దేశంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. వీధులన్నీ పసుపు, ఆకుపచ్చ రంగులతో నిండిపోయాయి.
 ఇక రియో డి జనీరోలో ప్రసిద్ధ క్రీస్తు విగ్రహం ఉన్న మౌంట్ కార్కోవాడో పర్వతాన్ని అందంగా అలంకరించారు. విగ్రహాన్ని టోర్నీలో పాల్గొనే 32 దేశాల జాతీయ పతాక రంగులతో ప్రతిబింబిస్తున్నారు.
 
 ఈ అత్యంత ఆదరణ క్రీడా టోర్నీ విజయవంతం కావాలని చాలా మంది ప్రముఖులు తమ సందేశాలను పంపారు. ఇందులో పోప్ ఫ్రాన్సిస్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘అద్భుత ప్రపంచకప్ కోసం అందరికీ శుభాకాంక్షలు. నిజమైన సోదరభావంతో ఆడాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

 

Leave a Comment