జోకర్ బ్యాచ్ ఎండి: పార్టీలో రాహుల్‌కి షాక్ మీద షాక్

rahul-gandhiన్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పార్టీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే కేరళకు చెందిన ఓ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని జోకర్‌గా చెబుతూ.. ఆయనను తొలగించాలని చెప్పారు. ఆయన పైన వేటు కూడా పడింది. తాజాగా పలువురు నేతలు కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయానికి రాహుల్ గాంధీని తప్పు పడుతున్నారు. రాహుల్ గాంధీని ఓ పార్టీ నేత ఒకరు జోకర్‌ని చేస్తే, పార్టీకి చెందిన ఇంకో ఎమ్మెల్యే జోకర్ బ్యాచ్‌కు ఎండీగా మార్చేయడం గమనార్హం. కాంగ్రెస్ పరాభవానికి కారణం రాహుల్ మాత్రమేనని పార్టీలో మెజారిటీ నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆయనపై పూర్తిస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

రెండ్రోజుల క్రితం కేరళ కాంగ్రెస్ నేత ముస్తఫా.. రాహుల్‌ను జోకర్ అని అనడంతో ఆయనను పార్టీ బహిష్కరించింది. ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్.. రాహుల్‌ను జోకర్ల బృందానికి ఎండీ అని అంటూ విమర్శించారు. సార్వత్రికంలో కాంగ్రెస్ ఓటమికి రాహుల్‌తోపాటు ఆయన సలహాదారులే కారణమని తేల్చేశారు. ఇప్పటికైనా సోనియా గాంధీ.. రాహుల్‌పై మమకారాన్ని వీడి పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని భన్వర్‌లాల్ కోరుతున్నారు. నాయకత్వ మార్పు తక్షణమే జరగాలని కోరుతున్నారు. వారసత్వమే అర్హతగా కలిగిన నాయకులతో ప్రయోజనం శూన్యమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న నేతను తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యామంటూ రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ కేరళ నేతలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్ బదులు ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మేలని అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ.. సోనియా, రాహుల్ గుండె ధైర్యం చూపించి ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకు వెళ్లారంటూ శనివారం మరో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే రాహుల్ గాంధీని సీనియర్ నేతలు మాత్రం వెనుకేసుకొస్తున్నారు. పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా మాట్లాడుతూ ఎన్నికల్లో విజయానికి రాహుల్ శాయశక్తులా ప్రయత్నించారన్నారు. ఓటమికి అందరూ బాధ్యత వహించాలన్నారు.

Leave a Comment