టిడిపిలోకి జూపూడి ఎఫెక్ట్: వైయస్ జగన్‌తో మందకృష్ణ భేటీ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలవర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ రావు తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జూపూడి ప్రభాకర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నంత వరకు ఆ పార్టీ నిర్ణయం చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి లేకపోవడంతో మందకృష్ణ మాదిగ జగన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జూపూడి ప్రభాకర్ రావు వైసిపికి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరారు. మందకృష్ణ మాదిగ భేటీతో ఎస్సీ వర్గీకరణకు జగన్ మద్దతు తెలిపారు.

పులివెందులలో జరిగిన పార్టీ ప్లీనరీలో వర్గీకరణను అనుకూలంగా చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. సోమవారం ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అద్యక్షుడు మందకృష్ణ మాదిగ అసెంబ్లీ ఆవరణలో జగన్‌ను కలిశారు. ఏబీసీడీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసిన నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వంపై తీర్మానం చేసే విధంగా ఒత్తిడి పెంచాలని జగన్‌ను కోరారు. ఏబీసీడీ వర్గీకరణకు ప్రభుత్వం సభలో తీర్మానం చేస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని మందకృష్ణకు జగన్‌ తెలియజేశారు.

ఇదిలావుంటే, మందకృష్ణ మాదిగ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, ఏపీ ప్ర భుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న ఆయన వైఖరిని ఎంతమాత్రం సహించేది లేదని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆది వారం జరిగిన మాదిగ జేఏసీ గ్రేటర్‌ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అన్ని కులాలను కలుపుకుని అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్‌ సర్కారు పనిచేస్తోందన్నారు.

మందకృష్ణ మాదిగ నిజంగా మాదిగల పక్షాన నిలిచి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి పార్లమెంటులో వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలన్నారు. డిప్యూటీ సీఎం, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌, సాంస్కృతిక వారథి చైర్మన్‌ పదవుల్లో కేసీఆర్‌ మాదిగలను నియమించా రన్నారు. కేసీఆర్‌కు అండగా మాదిగలు ఉంటారన్నారు.

Leave a Comment