టీడీపీలో నాలుగు స్తంభాలాట!

tdpనంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం నలుగురు ప్రధాన నేతలు పార్టీలో ఉండటంతో ఎవరి నాయకత్వంలోకి వెళ్లాలో కార్యకర్తలకు అర్థం కావటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల వరకు మాజీమంత్రి ఫరూక్ నాయకత్వంలో పార్టీ కొనసాగేది. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు.

ఇదిలా ఉండగా నంద్యాల పార్లమెంట్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డిల మధ్యే ఐక్యత అంతంత మాత్రంగా ఉంటే ఎస్పీవై రెడ్డి చేరడంతో పార్టీలో మరింత గందరగోళం ఏర్పడిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక మాజీమంత్రి టీజీ వెంకటేష్ అనుచరుడిగా మరో స్థానిక నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసుల శెట్టి పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే తమను ఓడించిన ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి తీసుకు రావడమే కాకుండా, ఎన్నికల సమయంలో తమకు సహకరించని పెసలకు మద్దతు ఇవ్వడంపై ఫరూక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో నాలుగు స్తంభాల ఆట కొనసాగుతున్నదని ఏ స్తంభంతో ఎలాంటి సమస్య తలెత్తుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి.

Leave a Comment