టీలో అధికారానికి పోటీ: కెసిఆర్ డబుల్ గేమ్

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు పార్టీలు అప్పుడే పోటీ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమకు పూర్తి మెజారిటీ వస్తుందనే విశ్వాసంతో తెరాస kcrఅధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో ఇప్పటి నుంచే ఆయన తనకు మద్దతు ఇచ్చే పార్టీలకు గాలం వేసే పనిలో పడ్డారు.అయితే, కెసిఆర్ కేంద్రంలో మద్దతు ఇచ్చే విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి ఎవరు వచ్చేట్లుంటే వారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తెరాస నాయకులు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అవసరమైతే రాష్ట్రంలో బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు.మజ్లీస్‌తో కలవకపోతే తెరాసతో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని బిజెపి నాయకులు అంటున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో, ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కాంగ్రెసును అడ్డుకోవడమో చేయాలనే ఉద్దేశంతో తెరాస పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.ఇదిలావుంటే, కాంగ్రెసు కూడా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది. ఈ విషయంపై కాంగ్రెసు తెలంగాణ నేతలు మజ్లీస్‌తోనూ, సిపిఐతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల సారాంశంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.సిపిఐ, కాంగ్రెసు తెలంగాణలో పొత్తు పెట్టుకుని పోటీకి దిగాయి. తమకు కనీసం మూడు నుంచి నాలుగు సీట్లు వస్తాయనే ఆశతో సిపిఐ ఉంది. ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదని సిపిఐ కార్యదర్శి నారాయణ భావిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు, తెరాస చేరువ కావాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ రెండు పార్టీలు పరస్పరం ఆధిక్యత సాధించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

Leave a Comment