టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్

9ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అంటే ప్రాణమిచ్చే దేశాల్లో బ్రెజిల్‌దే అగ్రస్థానం. ఇక తమ దేశంలోనే ప్రపంచకప్ జరుగుతుంటే… అభిమానుల ఆనందానికి అంతే లేదు. దీంతో సహజంగానే ఈ జట్టు ఉన్న గ్రూప్ ‘ఎ’ పై ఆసక్తి పెరిగింది. ఇక టోర్నీలో టైటిల్ ఫేవరెట్స్‌లో బ్రెజిల్ ఒకటి.
 
బ్రెజిల్
గతేడాది ఫిఫా కాన్ఫెడరేషన్ కప్ గెలుచుకున్న ఈ జట్టు ఈ టోర్నీలోనూ అదే స్థాయిలో అదరగొడుతుందని విశ్లేషకుల అంచనా. ఫైనల్లో చాంపియన్ స్పెయిన్‌ను మట్టికరిపించిన సిల్వ సేన భీకర ఫామ్‌లో ఉంది. ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ జట్టు తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. గత ప్రపంచకప్‌ల్లో బ్రెజిల్ ఇదివరకే ఈ గ్రూప్‌లో మిగిలిన జట్లతో ఆడిన అనుభవం ఉంది. తమ తొలి మ్యాచ్‌ను క్రొయేషియాతో జూన్ 12న ఆడుతుంది.

గత ప్రదర్శన: ఓవరాల్‌గా టోర్నీ మొత్తంలో 19 సార్లు బరిలోకి దిగిన బ్రెజిల్ ఐదు సార్లు (1958, 62, 70, 94, 2002) విజేతగా, రెండు సార్లు రన్నరప్ (1950, 98)గా నిలిచింది. అన్ని ప్రపంచకప్‌లూ ఆడిన ఒకే ఒక జట్టు బ్రెజిల్. దక్షిణాఫ్రికాలో క్రితం సారి (2010) జరిగిన టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ దాటలేకపోయింది. నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో 1-2 తేడాతో ఓడి అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

కీలక ఆటగాళ్లు: ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు నైమర్. తను ఈ జట్టు ఆటగాడే. సొంత దేశంలో జరుగబోయే ఈ టోర్నీలో ఇతడే కీలకం. అతనితో పాటు రాబిన్హో, డానీ అల్వెస్, సిల్వ, వెటరన్ గోల్ కీపర్ జూలియో సీజర్ జట్టు విజయానికి దోహదపడే అవకాశం ఉంది.అర్హత సాధించారిలా..: ఆతిథ్య జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో దక్షిణ అమెరికా జోన్  క్వాలిఫై మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం రాలేదు.
 అంచనా:  ఫైనల్
 
క్రొయేషియా
ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో క్రొయేషియా ప్రాతినిధ్యం చాలా తక్కువ. 1998లో తొలిసారిగా ఈ మెగా ఈవెంట్‌లో అడుగు పెట్టింది. అయితే ఆరంభ ం మాత్రం ఘనంగానే జరిగింది. ఏకంగా మూడో స్థానంలో నిలిచి ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత 2002, 2006లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. 2010 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.

కీలక ఆటగాళ్లు: మిడ్ ఫీల్డర్ లూకా మోడ్రిక్, స్ట్రయికర్ మారియో మాండ్రుజిక్, ఇవాన్ రాకిటిక్
 అర్హత సాధించారిలా..: యూరోప్ నుంచి ప్రపంచకప్ అర్హత కోసం జరిగిన మ్యాచ్‌ల్లో గ్రూప్-ఎలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్‌లు ఆడాల్సి వచ్చింది (గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. రెండో స్థానంలో ఉన్న జట్లు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడతాయి). ప్లే ఆఫ్‌లలో రాణించి బ్రెజిల్ టిక్కెట్ దక్కించుకుంది.
అంచనా: గ్రూప్ దశ దాటొచ్చు
 
మెక్సికో
ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లలో ఈ జట్టు గట్టి పోటీనే ఎదుర్కొన్నా చివరి వరకూ నిలబడింది. గ్రూప్ ‘ఎ’లో క్రొయేషియాతో జరిగే మ్యాచ్ వీరికి కీలకం. క్రొయేషియాను ఓడిస్తే తొలి రౌండ్‌ను దాటొచ్చు.
గత ప్రదర్శన: స్వదేశంలో జరిగిన 1970, 1986 ప్రపంచకప్‌లలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.గత ప్రపంచకప్‌లో 14వ స్థానంలో నిలిచిన ఈ జట్టు తామాడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది. ఓవరాల్‌గా 14 సార్లు బరిలోకి దిగింది.

కీలక ఆటగాళ్లు: రౌల్ జిమినెజ్, ఒరిబ్ పెరల్టా
అర్హత సాధించారిలా: కాన్ఫెడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికన్ అండ్ కరీబియన్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (కాంకాకాఫ్), ఓషియానియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఓఎఫ్‌సీ) క్వాలిఫికేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో మెక్సికో విజేతగా నిలిచి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది.
 అంచనా: గ్రూప్ దశ దాటొచ్చు
 
కామెరూన్
ఆఫ్రికాలో అత్యంత విజయవంతమైన జట్టు. ఈ గ్రూప్‌లో కామెరూన్‌ను అండర్‌డాగ్‌గా చెప్పుకోవచ్చు. గతంలో తమ ఆటతీరుతో ఆఫ్రికా సింహాలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే జట్టులో సమన్వయం కొరవడడంతో మంచి ఫలితాలు సాధించలేకపోతోంది.
గత ప్రదర్శన: వీరి వరల్డ్ కప్ చరిత్రలో 1990 టోర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనాను తొలి మ్యాచ్‌లోనే కంగుతినిపించారు. అలాగే అంచనాలకు అందని రీతిలో ఆడి ఏకంగా క్వార్టర్స్ దశకు చేరారు. ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికా జట్టు ఇదే. ఇప్పటికి ఆరు సార్లు ప్రపంచకప్ ఆడిన కామెరూన్ గత టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.

కీలక ఆటగాళ్లు: స్టార్ స్ట్రయికర్ సామ్యూల్ ఎటో, నికోలస్ కులు, మిడ్ ఫీల్డర్లు అలెగ్జాండ్రె సాంగ్, జీన్ మకోన్
అర్హత సాధించారిలా..: ప్రపంచకప్ అర్హత గ్రూప్ 1లో కామెరూన్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి ప్లే ఆఫ్ రౌండ్‌కు వెళ్లింది. అక్కడ ట్యునీషియాపై నెగ్గింది
అంచనా: తొలి దశ దాటితే గొప్ప

Leave a Comment