తమ్మీ, హరీష్ నోరెలా వచ్చింది: డికె అరుణ ప్రశ్న

DKAruna

“తమ్మీ హరీష్‌! ప్రాజెక్టులను మేం అభివృద్ధి చేయకుంటే ఇప్పుడీ దశలో ఉండేవా? మంత్రిగా పనులు పూర్తి చేయించడం మాని, నా హయాంలో పనులు జరగలేదంటూ విమర్శలు చేయడానికి నోరెలావచ్చింది?” అని కాంగ్రెసు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శనకు తనను కూడా ఆహ్వానించి ఉంటే వాటి అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేశామో వివరించే వాళ్లమని చెప్పారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీ్‌షరావు గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని, మంత్రిగా ఉన్న డీకే అరుణ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎనిమిది నెలలైనా ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదని విమర్శించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో అందరిని కలుపుకొని బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిందని, ఇప్పుడు తెలంగాణలో విపక్ష ఎమ్మెల్యేల స్థానాలలో వివక్ష చూపితే భవిష్యత్తులో అలాంటి ఉద్యమమే జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని తెలంగాణ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, ఎస్టీలకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని నిలదీశారు.

కేజీ టూ పీజీ ఉచిత విద్య విషయం అమల్లోనూ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. బలహీనవర్గాలకు ఇళ్ల పథకం అతీగతీలేకుండా పోయిందని, తాము మంజూరు చేసిన ఇళ్లకు కూడా ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ఫాస్ట్‌ పథకం డెడ్‌ అయ్యిందని, చివరకు తాము ప్రవేశపెట్టిన రీయింబర్స్‌మెంటు పథకమే దిక్కయ్యిందని వ్యాఖ్యానించారు.

Leave a Comment