తెలుగుదేశం వైపుగా లగడపాటి కదలికలు!!

lagadapati1399474619    సన్యసించడం అంటేనే… అన్నిటినీ త్యజించేయడం.. అయితే రివర్స్‌గేర్‌లో సన్యాసాన్ని కూడా త్యజిస్తే దాన్ని ఏమంటారు? బహుశా ‘లగడపాటి రాజగోపాల్‌’ అంటారేమో!! ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన వెంటనే.. సీమాంధ్ర ప్రాంతంలో ఆ పార్టీ ఎదుర్కొనబోతున్న గడ్డు పరిస్థితుల్ని క్షణాల్లో గెస్‌ కొట్టి.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన తెలివైన రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్‌. ఆపద్ధర్మంగా ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీకి దన్నుగా ఉన్నట్లుగా కాస్త బిల్డప్‌ ఇచ్చారు గానీ.. కాలక్రమంలో అది మట్టిగుర్రమేనని.. దాన్ని నమ్ముకుని ఏరు దాటడం అసాధ్యం అని అర్థం చేసుకున్నారు. కిరణ్‌ పార్టీలో తాను లేనని, ఆ పార్టీకి తనకు సంబంధం లేదని ఇటీవల ప్రకటించారు. సర్లే.. ఆయన సన్యాసం తీసుకుని ప్రశాంతంగా బతుకుతున్నారు కదా.. నిజమే కాబోలు అనుకున్నారు జనం.

తాజాగా లగడపాటి రాజగోపాల్‌ అనుసరిస్తున్న పోకడను గమనిస్తోంటే.. ఆయన నెమ్మదిగా తెలుగుదేశానికి దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట లగడపాటి.. సీమాంధ్రలో 70 శాతం పోలింగ్‌ జరిగితే తెలుగుదేశానికి అనుకూల ఫలితాలు వస్తాయంటూ.. ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. తాజాగా బుధవారం నాడు.. తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఒకసారి సన్యసించిన వ్యక్తి.. మళ్లీ నిర్ణయం తీసుకుంటానని అనడమే అనుమానాస్పద వ్యవహారంలాగా భావిస్తోండగా.. ఫలితాలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయని మళ్లీ సెలవిచ్చారు.

ఇలా మాటల్లో తెలుగుదేశం మీద అవ్యాజ ప్రేమానురాగాల్ని చూపించడంతో పాటూ.. ఆయన తెదేపా ఎంపీ సుజనాచౌదరి తో కలిసి.. ఇటీవల అరెస్టు అయి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జైలులో రిమాండులో ఉన్న తెలుగుదేశం నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ కొత్త స్నేహాలు, కొత్త బంధాలు, కొంగొత్త పరామర్శలు అన్నీ గమనిస్తున్నప్పుడు.. తెలుగుదేశం ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించిందంటే గనుక.. వెంటనే లగడపాటి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని అర్థమవుతోంది.

Leave a Comment