తొలిసారి సెమీస్‌లోకి…

thసిమోనా,
పెట్కోవిచ్ జోరు
ఫ్రెంచ్ ఓపెన్

పారిస్: క్వార్టర్ ఫైనల్లోపే టాప్-10 సీడింగ్స్ నుంచి ఏకంగా ఏడుగురు క్రీడాకారిణులు ఇంటిముఖం పట్టినా… అవేమీ పట్టించుకోకుండా రుమేనియా యువతార సిమోనా హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సిమోనా అంచనాలకు మించి రాణించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 22 ఏళ్ల సిమోనా 6-2, 6-2తో 2009 చాంపియన్, 27వ సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)ను చిత్తు చేసింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిమోనా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సిమోనా సెమీఫైనల్లో జర్మనీకి చెందిన 28వ సీడ్ ఆండ్రియా పెట్కోవిచ్‌తో తలపడుతుంది.

మరో క్వార్టర్ ఫైనల్లో పెట్కోవిచ్ 6-2, 6-2తో 2012 రన్నరప్, 10వ సీడ్ సారా ఎరాని (ఇటలీ)పై విజయం సాధించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెట్కోవిచ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఒకప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన పెట్కోవిచ్ ఆ తర్వాత గాయాల కారణంగా వెనుకబడిపోయింది.

రెండేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన ఈ జర్మనీ అమ్మాయికి ‘డ్రా’ కూడా అనుకూలంగానే పడింది. కేవలం క్వార్టర్ ఫైనల్లోనే ఆమెకు సీడెడ్ ప్రత్యర్థి ఎదురైంది. ఓవరాల్‌గా 18వ ప్రయత్నంలో కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గతంలో మూడుసార్లు ఈ అవకాశం వచ్చినా (2011 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది.

నేటి మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్
షరపోవా (7)    x యూజిన్ బౌచర్డ్ (18)
ముఖాముఖి రికార్డు: 2-0
సిమోనా హలెప్ (4)    x పెట్కోవిచ్ (28)
ముఖాముఖి రికార్డు: 2-1
నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్

సాయంత్రం గం. 6.30 నుంచి
నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

Leave a Comment