ధనికులతోనే మోడీ కలుస్తారు : రాహుల్‌గాంధీ

rahul-gandhiచండీఘర్‌ :  బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తనపై చేసిన ‘పావర్టీ టూరిజం’ వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేశారు. ఈ విషయమై మోడీపై రాహుల్‌ గాంధీ వాడీవేడి ఆరోపణలు చేస్తున్నారు. దళితుల ఇళ్లను నరేంద్రమోడీ సందర్శించటం, వారి ఇళ్లల్లో భోజనం చేయటం తానెప్పుడూ చూడలేదని, ఆయనెప్పుడూ ధనికులతోనే కలుస్తారని, అదానీ లాంటి వ్యక్తులతో భుజిస్తారని రాహుల్‌గాంధీ విమర్శించారు. దళితుల ఇళ్లల్లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భోజనం చేయటాన్ని ‘పావర్టీ టూరిజంగా’ నరేంద్రమోడీ ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. బఠిండా లోక్‌సభ నియోజికవర్గంలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌ అధ్యక్షుడైన మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్ధతుగా ఎన్నికల ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్‌ బాదల్‌ కోడలు హరీస్మారాత్‌ కౌర్‌ ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారు. వేల ఎకరాల స్థలాల్ని అదానీ గ్రూప్‌ సంస్థకు కేవలం గజానికి రూపాయి చొప్పున బహూకరించారని మోడీని ఉద్దేశించి రాహుల్‌ ఆరోపించారు. అవినీతిపై మోడీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని అన్నారు. అంతేగాక ఇతర పార్టీ నాయకుల పట్ల మర్యాదగా నడుచుకోవటం కూడా మోడీకి తెలియదని రాహుల్‌ అన్నారు.

Leave a Comment