ధూంధాం షురూ!

2సాక్షి, హైదరాబాద్: చిమ్మచీకట్లను చీలుస్తూ వందల కాగడాలు… అంబరాన రంగురంగుల వెలుతురు పూలను విరజిమ్మే పటాకులు… దీపాలంకరణలతో ముస్తాబై వెలిగిపోతూ ప్రభుత్వ భవనాలు… అమరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల నివాళులు..  కూడళ్లు, వీధుల్లో పార్టీల జెండాల రెపరెపలు… జై తెలంగాణ నినాదాలు… ఆటలు, పాటలు, నాట్యాలు, అలాయ్ బలాయ్ దావతులు… ఆలింగనాలు, అభినందనలు.. ఇలా తెలంగాణవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే కొత్త రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ధూంధాంగా ఆరంభమయ్యాయి! దశాబ్దాల ఆకాంక్షను సఫలం చేస్తూ అరుదెంచిన రాష్ట్రానికి తెలంగాణ సమాజం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది.
సోమవారం నుంచే కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం నుంచే అధికారిక ఉత్సవాలు కూడా మొదలవుతున్నాయి. అంబరాన్నంటిన సంబురాలతో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ సంబురాలు ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని పది జిల్లాల్లో రాత్రి ఏడు గంటల నుంచే పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. ధూంధాంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ర్యాలీలు, సభలు నిర్వహించారు. ప్రభుత్వపరంగానూ పలుచోట్ల కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద టీ-జేఏసీ, టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో అమరులకు నివాళి అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారీగా బాణసంచా కాల్చారు. సచివాలయంలోని హెలీపాడ్ వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద ఎత్తున పటాకులు పేల్చారు. సచివాలయ ప్రాంతమంతా విద్యుత్ వెలుగులతో ధగధగలాడింది. గగన్‌విహార్, నెక్లెస్‌రోడ్‌లో తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద బాణసంచా పేల్చారు. పీపుల్స్‌ఫ్లాజా, ట్యాంక్‌బండ్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమాజీగూడ, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్బుల్లో టీజేఎఫ్, టీయూడబ్ల్యుజే ఆధ్వర్యం లో సంబురాలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌ను విద్యుద్దీపాలతో అలంకరించి వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని అన్ని కూడళ్లలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన కటౌట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలు వాటర్ ఫౌంటేన్లతో కూడళ్లు ధగధగలాడాయి. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ నుంచి గన్‌పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
 జిల్లాలు జిగేల్..: రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. వరంగల్‌లో కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన 32 అడుగుల అమరవీరుల స్థూపాన్ని కలెక్టర్ జి.కిషన్ ఆదివారం రాత్రి 12 గంటలకు ఆవిష్కరించారు. ఈ స్థూపాన్ని వరంగల్ సేవా సమితి, ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేశాయి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లో టీఎన్‌జీవోల ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు.
టీ-జేఏసీ, టీఆర్‌ఎస్, కులసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెవీలియన్ గ్రౌండ్‌లో రాత్రి 12 గంటలకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కేక్ కట్ చేశారు. నిజామాబాద్‌లోని గాంధీచౌక్‌లో ధూంధాం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహబూబ్‌నగర్‌లోని జెడ్పీ మైదానంలో సాయంత్రం ఆరు గంటలకే అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ గిరిజాశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నల్లగొండలో అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మూడ్రోజులుగా నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులను అధికారులు సత్కరించారు. నాగార్జున కాలేజీ మైదానంలో తెలంగాణ వంటకాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్‌లో టీఎన్‌జీవో, టీ-జేఏసీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున పటాకులు పేల్చారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోయాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రూపొందించిన భారీ ప్లెక్సీని నిర్మల్‌లో ఆవిష్కరించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ స్మితా సబర్వాల్ కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.

Leave a Comment