నయన నైట్ షో

nayantaraస్టార్ హీరో… స్టార్ డెరైక్టర్… స్టార్ ప్రొడ్యూసర్… ఇలా ఒక స్టార్ వేల్యూ ఉంటేనే నయనతార సినిమా చేస్తారు. దాంతో పాటు చుక్కలనంటే పారితోషికం తప్పనిసరి. ఇది నిన్నటి మాట. తాజాగా, నయనతార ఓ చిన్న బడ్జెట్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఆ సినిమాకి నూతన దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించనుండటం ఓ విశేషం కాగా, ఇప్పుడిప్పుడే పైకొస్తున్న ఆరి అనే నటుడి సరసన ఆమె నటించనుండటం మరో విశేషం. ఇప్పటివరకు అగ్రదర్శకుల చిత్రాల్లోనే నటించిన నయనతార ఓ కొత్త దర్శకునికి కాల్షీట్లు ఇవ్వడం టాక్ ఆఫ్‌ది కోలీవుడ్ అయ్యింది.
 
 పైగా, ఇది చిన్న బడ్జెట్ చిత్రం కావడం వల్ల నయనతార పారితోషికం కూడా ఇప్పుడు తను తీసుకుంటున్న ఇతర చిత్రాలకు ఉన్నంత ఉండకపోవచ్చు. ఇది హారర్ నేపథ్యంలో సాగే సినిమా. ఈ కథను ఇటీవల నయనతారకు చెప్పారట అశ్విన్. కథ, తన పాత్ర బాగా నచ్చడంతో ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఈ సినిమా చేయడానికి ఆమె ఒప్పుకున్నారని తెలిసింది. అతి తక్కువ రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారని, అందుకని నయనతార వరుసగా డేట్స్ కూడా ఇచ్చేశారని సమాచారం. దీనికి ‘నైట్ షో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
 

Leave a Comment