నా జీవిత కథ పాఠ్యాంశమా… వద్దు వద్దు

2న్యూఢిల్లీ : తన జీవిత కథను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. దేశంలో ఎందరో మహనీయులు ఉన్నారని, వారి జీవిత కథలను పాఠ్యాంశాలుగా చేరిస్తే పాఠశాల విద్యార్థులు మరింత స్పూర్తి పొందిన వారు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న నరేంద్ర మోడీ శుక్రవారం తన ట్విట్టర్లోపై విధంగా స్పందించారు.
నరేంద్రమోడీ జీవితంలోని విశేషాలతో కూడిన వివిధ అంశాలను పాఠ్యాంశంగా చేయాలని నిర్ణయించినట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమా గురువారం ప్రకటించారు. మోడీ జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఎంపిక చేసి ఆ పాఠ్యాంశంలో పొందుపరిచేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5,6, 7 తరగతులలో ఆ పాఠ్యాంశాన్ని పొందుపరుస్తామని ఆయన వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం 2015-16 నుంచి అమలులోకి వస్తుందని విశదీకరించారు.

అయితే నరేంద్రమోడీ జీవితం సూర్ఫిదాయకమని… ఆయన కథను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేరిస్తే మరింత మంది విద్యార్థులు మోడీలా తయారవుతారని మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతున్నట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పరాస్ జైన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మొగించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. గుజరాత్ రాష్ట్రంలో సాధారణ కుటుంబానికి చెందిన నరేంద్ర మోడీ…. జీవితంలో ఎదుర్కొన్న ఆటు పోట్లతోపాటు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని పాఠశాల విద్యార్థులకు వివరించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ మోడీ తన అభిప్రాయాన్ని వెల్లడించి ఆయా ప్రభుత్వాల ఆశలపై నీళ్లు చల్లారు.

Leave a Comment