నా బిడ్డ అఖిలప్రియకు మంత్రి పదవి ఆశపెట్టారు: భూమా నాగిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. తన కూతురు అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీవాళ్లు మంత్రి పదవి ఆశపెట్టారని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న తమ పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీపై తనపై అక్రమ కేసులు బనాయించిందని భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే తానేమి కేసులకు భయపడటం లేదని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో జరిగిన గొడవ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని తాను శాసనసభలో ప్రస్తావిస్తానని ఆయన బుధవార మీడియాతో చెప్పారు. వాస్తవానికి తన కూతురు అఖిల ప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే, మంత్రి పదవి కూడా ఇస్తామని ఆపార్టీ తనకు ఆశ చూపిందని ఆయన వెల్లడించారు.

తాను అందుకు తిరస్కరించాననని, దాంతో తనపై కక్ష గట్టి తనపై కేసులు మోపారని భూమా నాగిరెడ్డి ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు, పదవులు శాశ్వతమా అని ఆయన అన్నారు. పదవి పోతే చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతునారని భూమా వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి సతీమణి శోభానాగిరెడ్డి అకాల మరణం కారణంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతుల కూతురు అఖిలప్రియ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేశారు. ఆమె శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదిలావుంటే, గురువారం నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 30 మందికిపై పైగా శానససభ్యులు హాజరయ్యారు. శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు.

Leave a Comment