నిషికోరికి నిరాశ

download (2)గాండ్‌స్లామ్ నెగ్గిన ఆసియా తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాలనుకున్న నిషికోరి కల నెరవేరలేదు. నెం.5, 3, 1 సీడెడ్‌లను ఓడించి ఫైనల్ చేరిన 10వ సీడ్ నిషికోరిని టైటిల్ పోరులో 14వ సీడ్ సిలిక్ మట్టికరిపించాడు. యువ సంచలనాల మధ్య ఫైనల్ హోరాహోరీగా సాగుతుందన్న అంచనాలు తారుమారయ్యాయి. మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి 6 అడుగుల 6 అంగుళాల ఆజానుబహుడైన సిలిక్‌దే ఆధిపత్యం. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టాడు. ఆరో గేమ్‌లో నిషికోరి సర్వీస్ బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తర్వాత ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా 6-3తో సెట్ గెలుచుకున్నాడు. రెండో సెట్లోనూ సిలిక్ ధాటికి నిషికోరి నిలవలేకపోయాడు. సర్వీస్‌లో బలహీనంగా కనబడిన ఈ జపాన్ కుర్రాడు… గత మ్యాచ్‌ల్లోలా కోర్టులో వేగంగా కదల్లేకపోయాడు. రెండో సెట్ నాలుగో గేమ్‌లో మరోసారి నిషికోరి సర్వీస్ బ్రేక్ అయింది. అదే వూపులో తొమ్మిదో గేమ్‌లో మరో బ్రేక్ సాధించిన సిలిక్ 6-3తో రెండో సెట్ సాధించాడు.
నిషికోరి మాయ చేయలేదు: ఈ టోర్నీలో తొలి రెండు సెట్లు కోల్పోయి కూడా అద్భుతమైన విజయాలు సాధించిన నిషికోరి ఫైనల్లో ఆ మాయ చేయలేకపోయాడు. మూడో సెట్ నాలుగో గేమ్‌లో మరోసారి నిషికోరి తడబడ్డాడు. అతడి సర్వీస్ బ్రేక్ చేసిన సిలిక్.. తర్వాత అదే జోరు కొనసాగించి 5-3తో విజయం ముంగిట నిలిచాడు. తొమ్మిదో గేమ్‌లో టైటిల్ కోసం సర్వీస్ చేసిన సిలిక్.. తొలి షాటే భారీ ఏస్ సంధించాడు. రెండో షాట్ కూడా ఏసే. సిలిక్ స్కోరు 30-0. తర్వాత బేస్‌లైన్ ర్యాలీలో మరోసారి సిలిక్‌దే పైచేయి! 40-0తో గెలుపు ముంగిట నిలిచిన సిలిక్ డబుల్ ఫాల్ట్ చేశాడు. ఆ తర్వాత ఎలాంటి పొరపాటుకు అవకాశమివ్వలేదు. అద్భుతమైన బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో టైటిల్ ఎగరేసుకుపోయాడు.

Leave a Comment