నేనే నమ్మలేకపోతున్నా!

Parineeti Chopraఖాన్’తో కలసి పరిణీతి చోప్రా ఓ సినిమా చేస్తోం దనే ప్రచారం బాలీవుడ్‌లో ఇటీవల జోరందుకుంది. అయితే ఆ ఖాన్ ఎవరో తెలియక ఆరా తీసేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే ఎట్టకేలకు ఆ ఖాన్ ఎవరో తెలిసిపోయింది. ఈ వివరాలను మీడియాకు స్వయంగా పరిణీతి చోప్రాయే వెల్లడించింది. ‘సైఫ్ అలీఖాన్‌తో కలసి ఓ సినిమాలో నటించబోతున్నా. ఆయనకు నేను ఎన్నోరోజులుగా అభిమానిని. ఇప్పుడు ఆయనతోనే కలసి సినిమా చేస్తున్నాననే విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నా.
 
 పైగా ఇది ఆయన సొంత బ్యానర్‌లో నటిస్తున్న చిత్రం కావడం, సినిమాలో కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో మరింత సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా చిన్న చిన్న హీరోలతోనే సినిమాలు చేశాను. తొలిసారిగా సైఫ్‌తో చేస్తున్నందుకు ఏదోలా ఉంది. రణ్‌వీర్‌సింగ్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, అదిత్యరాయ్ కపూర్‌లతో కలసి నటించినప్పుడు ఇలాంటి భావన కలగలేదు. ఎందుకంటే నటులుగా మా అందరి అనుభవంలో పెద్దగా తేడా లేదు. కానీ ఇప్పుడు సైఫ్‌తో నటిస్తుండడం ఇప్పటిదాకా నటించిన దానికి భిన్నంగా ఉంటుంద’ని చెప్పింది.
 
 సైఫ్ సతీమణి కూడా సినిమాలో కథానాయిక పాత్ర కోసం ‘ఇషక్‌జాదే’ భామనే ఎంపిక చేసిందట. ఆమె వ్యవహార శైలి కరీనాకు ఎంతో నచ్చినందునే పరిణీతిని కథానాయిక పాత్ర కోసం సిఫారసు చేసిందని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్ సొంత బ్యానర్‌లోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారానే విజన్ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా హాస్యప్రధానంగా సాగుతుందని, అక్కడక్కడా భావోద్వేగాల రుచికూడా చూపుతూ క్లాస్, మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఖాన్‌తో పరిణీతి కెమెస్ట్రీ ఏమేరకు కుదురుతుందో వేచి చూడాలి.
 

Leave a Comment