నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తి కేసులో ట్విస్ట్: ఎబోలా కాదు.. అది కొత్త వైరస్!

గాంధీ ఆస్పత్రిలో ఎబోలా కేసు కొత్త మలుపు తిరిగింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఎబోలా ఉందన్న అనుమానాలతో అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. కాగా, అతడికి సోకినది ఎబోలా కాదని వైద్యులు తేల్చారు. దాన్ని నైజీరియాకు చెందిన కొత్త వైరస్ అని వారు పేర్కొంటున్నారు. ఈ వైరస్ సోకిన బాధితుడికి వైద్యం చేసేందుకు అక్కడి సిబ్బంది కూడా ముందుకు వచ్చేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ ఏంటో.. దానికి చికిత్స ఎలా అందించాలో తెలియకుండా ముందకు ఎలా వెళ్తామని వైద్య సిబ్బంది అంటున్నట్లు తెలిసింది. గతంలో ఎబోలా బాధితులకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులకు కూడా ఆ వ్యాధి సోకడంతో ఇప్పుడు ఈ బాధితుడికి చికిత్స చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదని సమాచారం.

అంతకుముందు జరిగిన విషయాల్లోకి వెళితే.. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకమైన వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తికి ఎబోలా లేదని, ఢిల్లీకి పంపిన రక్త పరీక్షల్లో ఎబోలా కాదని నిర్ధారణ అయ్యిందని గాంధీ సూపరింటెండెంట్ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. గత నెల 21న నైజీరియా నుంచి ముంబై వచ్చిన అతన్ని విమానాశ్రయంలో థర్మల్ స్కానర్ ద్వారా చెకప్ చెయ్యగా, ఎలాంటి జ్వరంగాని ఇతరత్రా విషయాలుగాని బయట పడకపోవడంతో ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. మూడురోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ గత నెల 24న జ్వరం, వంటినొప్పుల లక్షణాలు కనిపించడంతో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. చికిత్సపొందుతున్న తరుణంలో కడుపు ఉబ్బడం, యూరిన్ రాకపోవడం వంటివి జరగడంతో డాక్టర్లు కేర్ క్లినిక్స్‌కు పంపించారు. కేర్ క్లినిక్ ఇంఛార్జ్ అతనిలో అరుదైన వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని, తక్షణమే గాంధీ ఆసుపత్రిలో చేరాలని సూచించారు.

Leave a Comment